Aarogyasri Cards: రేవంత్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. ప్రైవేటు హెల్త్‌కార్డుల తరహాలో ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ కార్డులు
- రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులు
- కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని యూనిక్ ఐడీలతో కార్డులు
- వీలైనంత త్వరగా జారీచేయాలని నిర్ణయం
- ఆరోగ్యశ్రీలో మరో 100 చికిత్సలను చేర్చే యోచన
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కారు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులతో ఎలాంటి సంబంధమూ లేకుండా కొత్తగా ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పేరిట హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ దీనిని వర్తింపజేయాలని యోచిస్తోంది. ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థల మాదిరిగానే ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని యూనిక్ ఐడీతో కార్డులు తేవాలని భావిస్తోంది. ఈ కార్డుల్లో కుటుంబంలోని ప్రతి సభ్యుడికి సబ్ నంబర్ ఇస్తారు. ఈ కార్డును హెల్త్ ప్రొఫైల్‌కు లింక్ చేసి, స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను నిర్వహిస్తారు.
ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో అందిస్తున్న చికిత్సలకు మరో వంద చికిత్సలను జతచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పటి వరకు అందుబాటులో లేని ట్రామాకేర్‌ను కూడా చేర్చబోతున్నట్టు సమాచారం. అదే జరిగితే లబ్దిదారులకు జరిగే మేలు అంతా ఇంతా కాదు. ఇందుకోసం అదనంగా మరో రూ. 400 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రభుత్వం ప్రస్తుతం ఏటా రూ. 1100 కోట్లు వెచ్చిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న రూ. 5 లక్షల పరిమితిని రూ. 10 లక్షలకు పెంచడంతో భారం మరింత పెరిగింది. కాగా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట కొత్త హెల్త్ కార్డులను వీలైనంత త్వరగా జారీచేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు సమాచారం.