Team India: భారత టెస్ట్ చరిత్రలోనే అత్యుత్తమ భాగస్వామ్యం.. ద్రావిడ్-లక్ష్మణ్ చారిత్రాత్మక భాగస్వామ్యానికి నేటితో 23 ఏళ్లు!
- ఈడెన్ గార్డెన్స్‌లో 376 పరుగుల భాగస్వామ్యం అందించిన ద్వయం
- మ్యాచ్‌లో ఫాలోఅన్ ఆడుతూ 171 పరుగులతో విజయఢంకా మోగించిన భారత్
- ఆట ఐదో రోజు 6 వికెట్లతో విక్టరీలో హార్భజన్ సింగ్ కీ రోల్
క్రికెట్ మక్కాగా పేరొందిన ఈడెన్ గార్డెన్స్‌లో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ ద్వయం సరిగ్గా 23ఏళ్ల క్రితం ఇదే రోజున (మార్చి 14, 2001) భారత టెస్ట్ చరిత్రలోనే అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 115 పరుగులకే కీలకమైన 3వికెట్లు కోల్పోయి జట్టు పీకలలోతు కష్టాల్లో ఉన్న సమయంలో బరిలోకి దిగిన ఈ జోడీ ఏకంగా 376 పరుగుల భాగస్వామ్యం అందించింది. ఈ మ్యాచ్‌లో ఫాలోఆన్ ఆడిన టీమిండియా వీరిద్దరి భాగస్వామ్యం కారణంగా చివరికి విజేతగా నిలవడం విశేషం.
మొదటి టెస్టులో ఘోర ఓటమి భారంతో భారత జట్టు రెండో టెస్టు కోసం కోల్‌కతా వచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో టెస్టు మొదలైంది. మొదట బ్యాటింగ్ చేసిన కంగారు జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 455 పరుగులు చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా కేవలం 171 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఫాలో అన్ ఆడించింది ఆస్ట్రేలియా. అలా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 115 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన లక్ష్మణ్.. ద్రావిడ్‌తో జతకట్టాడు. ఇద్దరూ కలిసి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. తమదైన ఆటతో ఇద్దరూ క్రీజులో పాతుకుపోయారు.
కంగారు జట్టు బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ ద్వయాన్ని వీడదీయలేకపోయారు. ఇద్దరూ కూడా భారీ సెంచరీలతో కదంతొక్కారు. ద్రావిడ్ 181 పరుగులు చేస్తే, లక్ష్మణ్ 281 పరుగులతో తన టెస్టు కెరీర్లోనే నిలిచిపోయే గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా ఈ జోడీ 376 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఇక మ్యాచ్‌లో భారీ టార్గెట్ ఛేదనతో బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టును టర్బొనేటర్ హార్భజన్ సింగ్ ముప్పుతిప్పులు పెట్టాడు. ఏకంగా ఆరు వికెట్లు తీసి, జట్టును 171 పరుగుల తేడాతో గెలిపించాడు.
ఈ మ్యాచుపై భారత మాజీ క్రికెటర్ హేమాంగ్ బదానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము ఫాలోఅన్ ఆడుతూ 3 వికెట్లు కోల్పోడంతో మూడో రోజే బ్యాగులు సర్దుకున్నట్లు తెలిపాడు. నేరుగా విమానాశ్రయానికి పయనం అని కూడా ఫిక్స్ అయిపోయినట్లు చెప్పాడు. కానీ, ద్రావిడ్-లక్ష్మణ్ జోడీ ఆసీస్ బౌలర్లకు ధీటుగా నిలబడి, చివరికి జట్టుకు విజయాన్ని అందించడం ఎప్పటికీ మరిచిపోలేమని బదానీ గుర్తు చేశాడు.
ఇక ఈ మ్యాచుతో పాటు ద్రావిడ్-లక్ష్మణ్ భాగస్వామ్యం కూడా టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్ విక్టరీ ఆ తర్వాత భారత టెస్టు క్రికెట్‌ను పూర్తిగా మార్చేసింది కూడా. ప్రస్తుతం ఈ ఇద్దరు భారత క్రికెట్‌కు సేవలు అందిస్తున్నారు. రాహుల్ ద్రావిడ్ జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉంటే, వీవీఎస్ లక్ష్మణ్.. ఎన్సీఏ చీఫ్‌గా పని చేస్తున్నాడు.