Ch Malla Reddy: బెంగళూరు నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక ప్రకటన... మైనంపల్లి హన్మంతరావుపై ఆగ్రహం
- తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేసిన మల్లారెడ్డి
- ఈ అయిదేళ్లు ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని కీలక ప్రకటన
- తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగనున్నట్లు వెల్లడి
- మైనంపల్లి తన పట్ల మాట్లాడే భాష సరిగ్గా లేదని వ్యాఖ్య
- డీకే శివకుమార్‌ను వ్యాపార పనుల నిమిత్తం కలిసినట్లు వెల్లడి
- ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్ కోరిన మల్లారెడ్డి కుటుంబం
మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురువారం నాడు కీలక ప్రకటన చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ఈ అయిదేళ్లు ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం లేదని... బీఆర్ఎస్‌లోనే కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. తాను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశానని తెలిపారు. ఓ ప్రయివేటు కార్యక్రమంలో ఆయనను కలిశానన్నారు. కర్ణాటక కాంగ్రెస్ నేతను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వెల్లడించారు. డీకే శివకుమార్ తనకు స్నేహితుడని తెలిపారు. బిజినెస్ పనుల మీద ఆయనను కలిసినట్లు చెప్పారు.
ఇక కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు మాట్లాడే భాష సరిగా లేదన్నారు. నేను మీ అంతు చూస్తా... మీ కాలేజీలు మూసేస్తా... వీళ్లేమనుకుంటున్నారు... ఒరేయ్ మల్లిగా... ఇలాగేనా మాట్లాడేది? అని ఆవేదన వ్యక్తం చేశారు. మైనంపల్లి కంటే తాను వయస్సులో పెద్దవాడిని... అన్నింట్లో పెద్దవాడిని... ఇలాంటి మాటలు మాట్లాడుతారా? అన్నారు. ఆయన ఏమైనా పెద్ద బాస్ అనుకుంటున్నాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్ కోరిన మల్లారెడ్డి కుటుంబం
మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్ కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబం కాంగ్రెస్ అగ్రనాయకురాలిని కలిసే అవకాశముంది. అంతకుముందు ఆయన బెంగళూరులో డీకే శివకుమార్‌తో అరగంట పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, తనయుడు భద్రారెడ్డి కూడా ఉన్నారు.