Uttam Kumar Reddy: రేషన్ కార్డులు లేకపోయినా ప్రభుత్వ పథకాలు అందుతాయి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
- కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం
- ప్రతి ఏడాది ప్రతి నియోజకవర్గంలో 3,500 మందికి ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ
రేషన్ కార్డులు లేకపోయినప్పటికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని... ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హుజూర్‌నగర్‌లో సీతారామస్వామి గుట్ట సమీపంలో 2160 సింగిల్ బెడ్రూం ప్లాట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసి పైలాన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతీ ఏడాది 3,500 ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. హుజూర్‌నగర్‌లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని బయటపడేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కాళేశ్వరంలో చేసిన తప్పుడు విధానాలతో ప్రస్తుతం నీళ్లు ఉన్నప్పటికీ వాడుకోలేని పరిస్థితి ఉందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ తప్పులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ధరణి ద్వారా చేసిన ల్యాండ్ మాఫియాను ప్రజల ముందుకు తీసుకు వస్తామన్నారు. భద్రాద్రి, యాదాద్రి పేర్లను దోచుకోవడానికి ఉపయోగించుకున్నారని ఆరోపించారు.