Paytm: పేటీఎంకి థర్డ్ పార్టీ యాప్ లైసెన్స్ మంజూరు.. ఇకపై యూపీఐ పేమెంట్లకు అవకాశం
- యూపీఐ లావాదేవీలకు అనుమతించిన ఎన్‌పీసీఐ
- పేటీఎం యూజర్లకు నిరంతరాయ యూపీఐ పేమెంట్ల కోసం నిర్ణయం
- థర్డ్ పార్టీ ప్రొవైడర్లుగా పనిచేయనున్న యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్‌లు
ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించినప్పటికీ, థర్డ్ పార్టీ యాప్‌గా కొనసాగేందుకు పేటీఎంకు గ్రీన్ సిగ్నల్ లభించింది. యాప్‌పై యూపీఐ లావాదేవీలను నిరాటంకంగా కొనసాగించేందుకు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ లైసెన్స్ మంజూరైంది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అనుమతి ఇచ్చింది. దీంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటికీ యాప్ ఇకపై థర్డ్ పార్టీ అప్లికేషన్‌గా పనిచేయనుంది. తద్వారా యూజర్లు ఈ యాప్‌పై యూపీఐ చెల్లింపులను కొనసాగించే వీలు కలిగింది. ఇందుకుగానూ ప్రముఖ బ్యాంకులతో పేటీఎం భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్‌లు పేటీఎం పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ బ్యాంక్‌లుగా ఉంటాయని ఎన్‌పీసీఐ ప్రకటనలో పేర్కొంది.
Paytmతో చేతులుకలిపిన ప్రస్తుత వ్యాపారులకు, కొత్తగా చేరిన UPI వ్యాపారులకు యస్ బ్యాంక్ వ్యాపారి బ్యాంకుగా సేవలందిస్తుంది. పేటీఎం యాప్ యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఎన్‌పీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది. పేటీఎంకు సంబంధించిన అన్ని విభాగాలను వీలైనంత త్వరగా కొత్త థర్డ్ పార్టీ సిస్టమ్ ప్రొవైడర్ బ్యాంక్‌లకు అందించాలని ఎన్‌పీసీఐ ఆదేశించింది. కాగా రెగ్యులేటరి నిబంధనలు పాటించని కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.