Russian Elections: రష్యాలో అధ్యక్ష ఎన్నికలు.. శుక్రవారం నుంచి 3 రోజుల పాటు పోలింగ్

Polling begins in Russian presidential Elections

  • బరిలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలువురు నేతలు 
  • పుతిన్ గెలుపు లాంఛనమేనంటున్న అంతర్జాతీయ మీడియా
  • ఈ ఎన్నికలు ఓ బూటకమంటూ విమర్శ
  • ప్రజలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొని దేశ ఐక్యత చాటాలంటూ పుతిన్ పిలుపు

రష్యాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 8.00 గంటలకు పోలింగ్ మొదలైంది. మూడు రోజుల పాటు ఓటింగ్ కొనసాగనుంది. అయితే, ఈ ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజయం లాంఛనమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియా విమర్శిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేతల్లో కొందరు జైళ్లల్లో మగ్గుతుంటే మరికొందరు విదేశాల్లో తలదాచుకుంటున్న వైనాన్ని ప్రస్తావిస్తోంది. 

ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న వేళ ఈ ఎన్నికలకు అమిత ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు, ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చి ఓటేయాలని పుతిన్ పిలుపునిచ్చారు. ప్రజలు ఐక్యత, పట్టుదలను చాటాల్సిన సమయం ఇదేనని వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రష్యా ప్రజలందరూ ఒక్కటేనని గుర్తు చేశారు. ప్రజలు తమ పౌర బాధ్యతను నిర్వహించాలని, దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ రికార్డెడ్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే పుతిన్ ఐదోసారి రష్యా పగ్గాలు చేపడతారు. మరో ఆరేళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. రష్యా రాజకీయ దిగ్గజం స్టాలిన్ తరువాత అత్యధిక కాలం అధికారంలో ఉన్న నేతగా చరిత్ర సృష్టిస్తారు. 

అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య రష్యాలో పోలింగ్ జరుగుతోంది. మీడియా, మానవ హక్కుల సంస్థలపై అనేక ఆంక్షలు విధించారు. మరోవైపు, ఎన్నికల్లో నిలబడ్డ పుతిన్ ప్రత్యర్థులందరూ అనామకులేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘‘రష్యా ఎన్నికలు ఓ బూటకం. ఎన్నికల్లో ఎవరు పోటీచేయాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. దాని కనుసన్నల్లోనే ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ యూరోపియన్ అనాలిసిస్‌కు చెందిన డెమోక్రటిక్ రెసీలియన్స్ సెంటర్ డైరక్టర్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News