Pawan Political Ad: వైరల్ అవుతున్న పవన్ కల్యాణ్ పొలిటికల్ యాడ్
- ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న జనసేన, టీడీపీ, జనసేన
- ఫ్యాన్ గాలికి కొట్టుకుపోతున్న రాష్ట్ర భవిష్యత్తు అంటూ యాడ్
- సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో యాడ్ ప్రారంభం
రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు కూడా పూర్తయ్యాయి. ఏపీలో వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని కూల్చడమే తమ లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ ఒక ఆసక్తికర పొలిటికల్ యాడ్ ను విడుదల చేసింది. 'ఫ్యాన్' గాలికి కొట్టుకుపోతున్న రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను 'గాజు గ్లాసు' చేబట్టిందని జనసేన తెలిపింది.
గత ఎన్నికలకు ముందు జగన్ మాట్లాడిన మాటలతో వీడియో ప్రారంభమతుంది. నాన్నను చూశారు... ఒక అవకాశం ఇవ్వండి... నాన్నగారి కంటే గొప్ప పాలన చేసే ప్రతి ప్రయత్నం చేస్తాననే హామీని మీ అందరికీ ఇస్తున్నానని జగన్ చెప్పిన వ్యాఖ్యలు తొలుత వస్తాయి. ఆ తర్వాత ఫ్యాన్ స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. టేబుల్ (బహుశా సీఎం టేబుల్) పైన ఉన్న ఫైల్స్ పై ఉన్న రాష్ట్ర అభివృద్ధి, ఇసుక పాలసీ, లా అండ్ ఆర్డర్ ఇలా అన్ని పేపర్లు ఫ్యాన్ గాలికి ఎగిరిపోతాయి. ఆ వెంటనే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. ఎగిరిపోయి చిందరవందరగా పడిని పేపర్లను పవన్ ఒక్కొక్కటిగా తీసుకుని, టేబుల్ మీద పెట్టి దానిపై గాజు గ్లాసు ఉంచుతారు. ఆ పక్కనే జనసేన, బీజేపీ, టీడీపీ గుర్తులు కనిపిస్తాయి. పొత్తు గెలవాలి, ప్రభుత్వం మారాలి అంటూ యాడ్ ముగుస్తుంది. చివర్లో మోదీ, పవన్ కల్యాణ్, చంద్రబాబుల ఫొటోలు కనిపిస్తాయి.