Pithapuram: పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం బాధ్యతను మిథున్ రెడ్డికి అప్పగించిన సీఎం జగన్!
- ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలో దిగుతున్న పవన్ కల్యాణ్
- పిఠాపురంలో వైసీపీ తరఫున ఎంపీ వంగా గీత పోటీ
- సీఎం జగన్ సహా ప్రచారానికి రానున్న వైసీపీ అగ్రనేతలు
- గతంలో రెండు చోట్లా వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయిన జనసేనాని
జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో, వైసీపీ అగ్రనాయకత్వం పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీ చేయగా, రెండు చోట్లా ఆయనను వైసీపీ అభ్యర్థులే ఓడించారు.
గతంలో పవన్ ను ఎలా ఓడించారో, ఈసారి కూడా అలాగే ఓడించేందుకు వైసీపీ వ్యూహకర్తలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎంపీ వంగా గీతను ఈసారి పిఠాపురం అసెంబ్లీ బరిలో దించుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ పిఠాపురం గెలుపు బాధ్యతలు ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించారు.
పిఠాపురంలో వైసీపీ ముఖ్యనేతలతో ప్రచారం చేయించనున్నారు. సీఎం జగన్ కూడా ఈ నియోజకవర్గంలో ప్రచారం చేస్తారని తెలుస్తోంది.
కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరిన నేపథ్యంలో, సామాజిక సమీకరణాల పరంగా కూడా తమకు కలిసివస్తుందని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. వంగా గీత ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు.