KTR: కవితను ఎలా అరెస్ట్ చేస్తారు? కోర్టులో మీరే ఇబ్బందులు ఎదుర్కొంటారు: ఈడీ అధికారి భానుప్రియ మీనాతో కేటీఆర్ వాగ్వాదం
- అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఎలా అరెస్ట్ చేస్తారు? అని నిలదీత
- సుప్రీంకోర్టులో చెప్పిన మాటలను ఈడీ అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం
- కావాలని అరెస్ట్ చేసేందుకు శుక్రవారం వచ్చారన్న కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ అధికారురి భానుప్రియ మీనా తదితరులతో వాగ్వాదానికి దిగారు. వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్ట్ చేశారనే విషయం తెలిసిన కేటీఆర్, హరీశ్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. విచారణ ముగిసిన అనంతరం కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్... ఈడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వీడియో వెలుగు చూసింది.
సోదాలు పూర్తయ్యాయని, అరెస్ట్ వారెంట్ ఇచ్చామని ఈడీ అధికారి భానుప్రియ మీనా చెబుతున్నారని, అలాగే అరెస్ట్ వారెంట్ ఇచ్చామని ఆమె చెబుతున్నారని పేర్కొన్నారు. సోదాలు ముగిశాక కూడా ఇంట్లోకి రావొద్దని అధికారులు హుకూం జారీ చేశాని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు? అని వారిని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఈడీ అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చారని మండిపడ్డారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా తీసుకు వెళతారు? అని ప్రశ్నించారు.