K Kavitha: ఇదిగో... అంతా పథకం ప్రకారమే కవితను అరెస్ట్ చేశారు!: హరీశ్ రావు

Harish Rao Press Meet Regarding the Arrest of MLC Kavitha

  • అక్రమ అరెస్టును న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొంటామన్న హరీశ్ రావు
  • బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు పన్నుతున్నాయని ఆరోపణ
  • ఈడీ అధికారులు ముందే ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేశారన్న హరీశ్ రావు
  • రేపు ఈసీ నోటిఫికేషన్ వస్తుందనగా ఈ రోజు అరెస్ట్ చేశారని వెల్లడి
  • సుప్రీం కోర్టు తీర్పు రావడానికి మూడునాలుగు రోజుల ముందు అరెస్ట్ ఏమిటి? అని ప్రశ్న
  • కావాలనే శుక్రవారం వచ్చారని... అదీ మధ్యాహ్నం వచ్చారన్న హరీశ్ రావు
  • కోర్టు సమయం అయిపోయాక సాయంత్రం అరెస్ట్‌ను ప్రకటించారని ఆగ్రహం

తమ పార్టీ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు పథకం ప్రకారం అరెస్ట్ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఈ అరెస్ట్‌పై హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ... అక్రమ అరెస్టును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు. అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి చట్టపరంగా పోరాడుతామని తెలిపారు. బీజేపీ తమపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. కవిత అరెస్ట్‌ను నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన చేపడతామన్నారు.

ఏడాదిన్నర క్రితం విట్‌నెస్ కింద నోటీసులు ఇచ్చామని చెప్పిన ఈడీ... ఈరోజు వచ్చి అక్యూస్డ్ కింద అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం దారుణమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి తమ పార్టీపై కుట్రలు పన్నుతున్నాయన్నారు. కవిత అరెస్ట్ ద్వారా తమ పార్టీ ప్రతిష్టను, కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమది ఉద్యమాల పార్టీ అని... ఇవి తమకు కొత్త కాదన్నారు. ఇలాంటి కుట్రలు, అణచివేతలను, అక్రమ కేసులు ఎదుర్కోవడం ఉద్యమం నుంచి తెలిసిందే అన్నారు. ఈ కుట్రలను దాటుకొనే తెలంగాణను సాధించామన్నారు. 

పథకం ప్రకారమే చేశారు...

  కవిత అరెస్టుపై అంతా ముందే ప్లాన్ చేసుకొని వచ్చారని హరీశ్ మండిపడ్డారు. అంతా పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. ఈడీ అధికారులు ముందుగానే ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకున్నారని తెలిపారు. రేపు ఈసీ నోటిఫికేషన్ వస్తుందనగా ఈ రోజు అరెస్ట్ చేశారని విమర్శించారు. ఈ నెల 19న సుప్రీం కోర్టు తీర్పు రావడానికి మూడునాలుగు రోజుల ముందు అరెస్ట్ ఏమిటి? అని ప్రశ్నించారు. కావాలనే శుక్రవారం వచ్చారని... అదీ మధ్యాహ్నం వచ్చారని తెలిపారు. తద్వారా కోర్టుకు వెళ్లకుండా పథకం వేశారని ఆరోపించారు. కోర్టు సమయం అయిపోయాక సాయంత్రం ఐదున్నరకు అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారని మండిపడ్డారు. ఓ మహిళను ఇలా అరెస్ట్ చేయడం దారుణమన్నారు.

కవిత అరెస్ట్‌ను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. సుప్రీంకోర్టులో అక్రమ అరెస్టుపై పిటిషన్ వేస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమను దెబ్బతీసేందుకే ఇలా చేశారని ప్రజలకు తెలుసునన్నారు. బీజేపీ కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటామన్నారు. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని... దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News