K Kavitha: కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత.. కస్టోడియల్ ఇంటరాగేషన్ కోరనున్న ఈడీ
- లిక్కర్ స్కామ్ లో నిన్న సాయంత్రం కవిత అరెస్ట్
- నిన్న అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్న కవిత, ఈడీ అధికారులు
- రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే గడిపిన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిన్న సాయంత్రం ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని కవిత నివాసంలో దాదాపు ఐదు గంటల సేపు సోదాలు, విచారణ జరిపిన ఈడీ అధికారులు... అమెను అదుపులోకి తీసుకుని నేరుగా ఢిల్లీకి తరలించారు. అర్ధరాత్రి సమయంలో వారు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి కవితను నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. రాత్రంగా ఆమె ఈడీ కార్యాలయంలోనే గడిపారు.
కవితకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. లిక్కర్ స్కామ్ లో కవితను లోతుగా విచారించేందుకు ఆమెను కస్టోడియల్ ఇంటరాగేషన్ కు కోరనున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కవిత అరెస్ట్ తో... ఇటు తెలంగాణ రాజకీయాలతో పాటు, అటు లిక్కర్ స్కామ్ విచారణలో పరిణామాలు ఊహించని మలుపు తిరిగాయి.