Komatireddy Venkat Reddy: చంద్రబాబు అరెస్టుపై ధర్నాను అడ్డుకున్న వారే ఇవాళ ధర్నాలు చేయడం విడ్డూరం: మంత్రి కోమటిరెడ్డి
- కవిత అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ నిరసనలు.. తీవ్రంగా మండిపడ్డ మంత్రి
- ఢిల్లీ లిక్కర్ స్కాంకు, తెలంగాణ ప్రజలకు సంబంధమేంటని ప్రశ్న
- ఢిల్లీలోని ఈడీ ఆఫీసు ముందు నిరసన చేసుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచన
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అరెస్టు అయితే తెలంగాణలో ధర్నాలు ఎందుకన్న నేతలే నేడు కవిత అరెస్టుపై నిరసనలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ‘అరెస్టు చేసిందేమో ఈడీ.. వచ్చి తీసుకెళ్లిందేమో ఢిల్లీ అధికారులు.. మరి హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ధర్నాలు చేయడం దేనికి?’ అని మంత్రి నిలదీశారు. ఢిల్లీకి వెళ్లి ఈడీ ఆఫీసు ముందు ధర్నాలు, నిరసనలు చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నేతలకు సూచించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు, తెలంగాణ ప్రజలకు సంబంధమేంటని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేస్తే రాష్ట్రంలో ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం దేనికని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. మొన్నటి వరకు ‘ఎవడు వస్తాడో రండి చూసుకుందాం’ అంటూ తొడలు కొట్టిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడేమో అమాయకులైన పార్టీ కార్యకర్తలను రోడ్లపైకి తీసుకొస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.