K Kavitha: కవిత తెల్లవారుజామున 3 గంటల వరకు ఇంజెక్షన్లు తీసుకున్నారు: కోర్టుకు తెలిపిన కవిత లాయర్
- కవిత తరపున వాదనలు వినిపించిన విక్రమ్ చౌదరి
- సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈడీ ఉల్లంఘించిందన్న విక్రమ్
- ఈడీ తరపున వాదనలు వినిపిస్తున్న జోయబ్ హుస్సేన్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోర్టులో ఇరు వైపుల న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ... కవిత తెల్లవారుజామున 3 గంటల వరకు ఇంజెక్షన్లు తీసుకున్నారని, ఆమె బీపీ గతంలో ఎన్నడూ లేనంత అసాధారణంగా ఉందని చెప్పారు. ఆమె మెడికల్ రిపోర్టులను కూడా వైద్యులు తమకు ఇవ్వలేదని చెప్పారు. వాదనలకు ముందు కోర్టు అనుమతితో విక్రమ్ చౌదరి కాసేపు కవితతో మాట్లాడారు.
సుప్రీంకోర్టులో ఈ నెల 19న కవిత పిటిషన్ పై విచారణ జరగనుందని... అప్పటి వరకు కవితకు మినహాయింపును ఇవ్వాలని విక్రమ్ చౌదరి కోరారు. ప్రస్తుత విచారణను అప్పటి వరకు ఆపాలని కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈడీ అధికారులు ఉల్లంఘించారని చెప్పారు. విక్రమ్ చౌదరి వాదనలు ముగిసిన తర్వాత ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ తన వాదనలు ప్రారంభించారు. సెక్షన్ 50 ప్రకారం సమన్లు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. ఏ కోర్టు కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పారు. మరోవైపు కోర్టు హాల్లో కవిత భర్త కూడా ఉన్నారు.