Mudragada Padmanabham: సినిమాల్లో హీరో అయితే ఎవరికి గొప్ప... నేను రాజకీయాల్లో హీరోని: ముద్రగడ పద్మనాభం
- సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం
- తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం
- రాజకీయాల్లోకి రావడానికి తనకు ఎవరి అనుమతి అవసరంలేదని స్పష్టీకరణ
- రాజకీయాల్లోకి రావడం నా ఇష్టం అంటూ ఉద్ఘాటన
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శల పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. తనను ఉద్దేశించి రకరకాల పోస్టులు పెడుతుండడం బాధాకరమని పేర్కొన్నారు.
తాను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదని అన్నారు. రాజకీయాల్లోకి రావడానికి తాను ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదని ముద్రగడ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రావడం నా ఇష్టం అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.
"మొలతాడు లేనోడు, లాగు లేనోడు నాకు రాజకీయ పాఠాలు చెబుతున్నారు. అది చాలా తప్పు. నేను మా ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజల భిక్షతో రాజకీయాల్లోకి వచ్చాను. వారి భిక్షతోనే ఎదిగాను. ఎన్నో ఉద్యమాలు చేశానంటే అది వారి భిక్ష వల్లే.
కాపుల కోసం ఉద్యమాలు చేశాను, దళితుల కోసం ఉద్యమాలు చేశాను. నా వర్గాన్ని, నా మనుషులను కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తాను. అక్కడ కులం కాదు, నా వర్గం ముఖ్యం. నాపై రకరకాల పోస్టులు తెలిసీ తెలియక పెడుతున్నారు. వారు సినిమాల్లో హీరో అవ్వొచ్చు... కానీ నేను రాజకీయాల్లో హీరోని. అంత పెద్ద హీరో కాకపోయినా చిన్న హీరోని.
ముద్రగడ ముఖ్యమంత్రి వద్దకు ఎందుకు వెళ్లాడు... మా నాయకుడి వద్దకు ఎందుకు రాలేదు? అని కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యమంత్రి గారి కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. వాళ్ల నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు... ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా చేశారు. జగన్ గారు ఎమ్మెల్యేగా, ఎంపీగా చేశారు... ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
మిథున్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వంగా గీత, కన్నబాబు వంటి పెద్దలను నా వద్దకు పంపించి నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అందుకు నేను సంతోషంగా అంగీకరించాను. వస్తాను అని చెప్పాను... వెళ్లాను. అయినా గానీ మా నాయకుడి వద్దకు ఎందుకు రావని ప్రశ్నిస్తున్నారు. ఏమిటి ఆయన గొప్ప... ఆయన సినిమా ఫీల్డ్ లో గొప్పవాడు అవ్వొచ్చు... రాజకీయాల్లో నేను గొప్పవాడ్ని" అంటూ ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు.