Election Commission: ప్రచారంలో హద్దుమీరవొద్దు.. రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరిక

Do not Cross Red Line During Campaign Election Commission warns Political Parties

  • గతంలా కాకుండా ఈసారి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక 
  • విద్వేష ప్రసంగాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టీకరణ 
  • స్టార్ క్యాంపెయినర్లకు మార్గదర్శకాలు చేశామని తెలిపిన సీఈసీ రాజీవ్ కుమార్

లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ సహా 4 నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు హద్దుమీరవద్దని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఎన్నికల నియమావళిని విధిగా పాటించాల్సిందేనని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్పష్టం చేశారు. ‘‘ గతంలో చాలాసార్లు నోటీసులు జారీ అయ్యాయి. కానీ చర్యలు అంతగా లేవు. నైతికమైన చర్యలు ఉండేవి. కానీ ఈసారి గట్టి చర్యలు ఉంటాయి. గత చర్యలు, చరిత్రను పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి పరిశీలించిన అనంతరం తుది మార్గదర్శకాలను జారీ చేశామని వివరించారు. ఎన్నికల కోడ్ అమలు విషయంలో క్షేత్ర స్థాయిలో సంసిద్ధమయ్యామని, రాజకీయ పార్టీలపై దృష్టి పెట్టామని రాజీవ్ కుమార్ చెప్పారు. పార్టీలోని స్టార్ క్యాంపెయినర్లు అందరికీ ఈసీ మార్గదర్శకాలతో కూడిన కాపీలను అందించాలని ఇప్పటికే సూచించామని ఆయన ప్రస్తావించారు. దేశంలో రాజకీయ పార్టీల మధ్య చర్చలు, వ్యాఖ్యలు దిగజారుతున్నాయని, అన్ని రాజకీయ పార్టీలకు కీలక సలహాలు, సూచనలు చేసినట్టు రాజీవ్ కుమార్ వివరించారు.

ఇక ఎన్నికల నియమావళికి సంబంధించిన మార్గదర్శకాలను స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదేనని రాజీవ్ కుమార్ అన్నారు. ఆ విషయాన్ని నోటీసుల ద్వారా పార్టీలకు తెలియజేశామని, ఈ మేరకు షెడ్యూల్ కంటే ముందుగానే అవగాహన కల్పించామని అన్నారు. రాజకీయ వ్యాఖ్యలు, చర్చలు స్ఫూర్తినిచ్చేలా ఉండడానికి పార్టీలకు పలు కీలక సూచలు చేశామని అన్నారు. విద్వేష ప్రసంగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. కుల, మతపరమైన విన్నపాలు, వ్యక్తిగత విషయాలపై విమర్శలకు దిగకూడదని సూచనలు చేశామన్నారు.

  • Loading...

More Telugu News