Pithapuram: పిఠాపురంలో జరగబోయేది ఇదే: వైసీపీ అభ్యర్థి వంగా గీత
- పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్
- ఎంపీ వంగా గీతను పవన్ కు ప్రత్యర్థిగా బరిలో దింపిన వైసీపీ
- పిఠాపురం కచ్చితంగా వైసీపీకి విన్నింగ్ సీట్ అవుతుందన్న వంగా గీత
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఈసారి ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న స్థానం పిఠాపురం. ఎందుకంటే, గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారు. అయితే, పిఠాపురంలో పవన్ పై వైసీపీ అభ్యర్థిగా కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. ఆమె తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, జగన్ సుపరిపాలన తనను గెలిపిస్తుందని అన్నారు.
"నన్ను పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేతలు, కార్యకర్తలు, అభిమానుల సాయంతో వైసీపీ తప్పకుండా పిఠాపురంలో విజయం సాధిస్తుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రతి అభ్యర్థికి ప్రత్యర్థి అభ్యర్థులు ఉంటారు. అయితే, పిఠాపురం నియోజకవర్గంపై ఇప్పుడందరి దృష్టి పడిందన్నది వాస్తవమే. పిఠాపురం హాట్ సీట్ అని అందరూ అంటున్నారు.... కానీ ఇది కచ్చితంగా విన్నింగ్ సీట్ కాబోతోంది. శక్తిమాత ఆశీస్సులతో, సీఎం జగన్ మద్దతుతో, ప్రజలు అందించబోయే దీవెనలతో వైసీపీ అభ్యర్థిగా నేను పిఠాపురంలో విజయం సాధిస్తాను... పిఠాపురంలో జరగబోయేది ఇదే.
ఈ నియోజకవర్గంతో ఎన్నో సంవత్సరాలుగా నాకు పూర్తి అనుబంధం ఉంది. ఈ నియోజకవర్గం ప్రజలతో, ఓటర్లతో, కుటుంబాలతో నాకు అనుబంధం ఉంది. వారి కుటుంబాల్లో ఒక సభ్యురాలిగా నేను పెరిగాను. అందరూ నన్ను పిఠాపురం ఆడపడుచు అనే అంటారు. ప్రస్తుతం నేను ఎంపీగా ఉన్నాను. నా పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడికి వెళ్లినా పిఠాపురం ఆడపడుచు అనే సంబోధిస్తారు.
జగన్ మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడా లేనంతగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రజల మద్దతు మాకే ఉంటుంది. మొన్నటి వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు... ఇప్పుడు జనం మెచ్చిన జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు... నేను నియోజకవర్గంలో పర్యటించినప్పుడు గమనించింది ఏంటంటే... ప్రతి ఒక్కరూ కూడా జగన్ బాబు రుణం తీర్చుకోవాలని అంటున్నారు" అని వంగా గీత వివరించారు.