Praja Galam: బొప్పూడి 'ప్రజాగళం' సభకు సర్వం సిద్ధం
- మార్చి 17న చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద భారీ సభ
- టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి నేతృత్వంలో ప్రజాగళం సభ
- హాజరుకానున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్
- సభకు 10 లక్షల మంది వస్తారని అంచనా
రేపు (మార్చి 17) చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నిర్వహించనున్న ప్రజాగళం సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు పార్టీల నాయకుల నిర్విరామ కృషితో వేదిక నిర్మాణం పూర్తయింది. ఏర్పాట్లన్నీ పూర్తయి సభకు సర్వం సిద్ధమైన నేపథ్యంలో, సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ అధికారులకు అప్పగించారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం ఏపీలో జరుగుతున్న భారీ బహిరంగ సభ కావడం, ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతుండడం కారణంగా అందరి దృష్టి ప్రజాగళం సభపై ఉంది. మూడు పార్టీల పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో జాతీయ మీడియా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులు ఢిల్లీ నుంచి చిలకలూరిపేట చేరుకున్నారు.
రాష్ట్ర భవిష్యత్తుకు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఈ సభ ద్వారా దశ-దిశ నిర్దేశించనుందని భావిస్తున్నారు. ప్రజాగళం సభ ద్వారా త్రిమూర్తులు మోదీ-చంద్రబాబు-పవన్ ఏమని భరోసా ఇస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ రూట్ మ్యాప్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కాగా, ప్రజాగళం వేదికపై టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులకు అవకాశం కల్పించనున్నారు. వేదికపై కూర్చునేందుకు ఒక్కో పార్టీ నుంచి 10 మంది చొప్పున అనుమతి ఇస్తారు.
ఇక, ఈ సభకు విచ్చేసేందుకు ప్రధాని మోదీ కోసం 3 హెలీప్యాడ్లు, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, ఇతర నేతలకోసం మరో 3 హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. ప్రధాని మోదీ భద్రతా సిబ్బంది భారత వాయుసేన హెలీకాప్టర్లపై సభా ప్రాంగణానికి వచ్చి ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రజాగళం సభా ప్రాంగణంలో 5 వేల మంది పోలీసులతో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జాగిలాలతో అణువణువు తనిఖీలు చేశారు.
రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారన్న అంచనాలతో ప్రాంగణంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో నేతల ప్రసంగాలను వీక్షించేందుకు 20 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.