Rains: తెలంగాణకు నాలుగు రోజులు వర్ష సూచన
- ఆదివారం నుంచి బుధవారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
- బులిటెన్ విడుదల చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
- నాలుగు రోజులపాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని సూచన
ఎండలు మండిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం హైదరాబాద్ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రానున్న నాలుగు రోజులు తెలంగాణకు వర్ష సూచన చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం బులిటెన్ విడుదల చేసింది.
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఆదివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇక సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నాడు సిద్దిపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కూడా వానలు పడతాయని పేర్కొంది. రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, నల్గొండ, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, వరంగల్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలకు బుధవారం వర్ష సూచన ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్టు హెచ్చరించింది.
వర్షాల ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలలోపే నమోదవుతాయని వాతావరణ విభాగం అంచనా వేసింది.