Election Commission: ఏప్రిల్ 15 వరకు ఓటు నమోదు చేసుకునేందుకు ఛాన్స్
- అర్హత కలిగిన యువత వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం
- ఫామ్-8ను నింపి ఆన్‌లైన్‌లో కూడా సమర్పించే ఛాన్స్
- మార్పులు చేర్పులకూ అవకాశం కల్పించిన ఎలక్షన్ కమిషన్
లోక్‌సభ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన అర్హతగల యువకులు ఏప్రిల్ 15 వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసేందుకు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు కూడా ఓటు నమోదు చేసుకోవచ్చని సూచిస్తోంది. కొత్తగా ఓటు నమోదు కోసం ఫారం-8 అప్లికేషన్‌ను ఆన్‌లైన్‌లో లేదా నియోజకవర్గ ఎన్నికల అధికారికి అందజేయవచ్చు. ఎన్నికల సహాయ అధికారి, పోలింగ్ కేంద్రం అధికారికి కూడా ప్రత్యక్షంగా దరఖాస్తును అందజేయవచ్చు. వివరాలను కూడా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
కాగా ఓటు నమోదు ప్రక్రియ ప్రతి సంవత్సరం కొనసాగుతూ ఉంటుంది. జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరు నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇస్తోంది. https://nvsp.in, https://ceotelangana.nic.in వెబ్‌సైట్లపై ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు.