KTR Delhi: చెల్లి కోసం ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్.. వీడియో ఇదిగో!

BRS Working President KTR Went To Delhi To Meet Kavitha

  • ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో ఈడీ కస్టడీలో కవిత
  • రోజూ కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు అనుమతి
  • ఇంటి భోజనం తెప్పించుకునేందుకు పర్మిషన్

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో అరెస్టు అయిన చెల్లెలు కవితకు అండగా ఉండేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఆదివారం ఉదయం ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడున్న మీడియా మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆగకుండా వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చెల్లికి అండగా అన్న బయలుదేరి వెళ్లాడంటూ బీఆర్ఎస్ అభిమానులు ఈ వీడియోను రీట్వీట్ చేస్తున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీలో భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సాయంత్రం వరకు కవిత ఇంట్లో సోదాలు జరిపింది.

సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో కవితను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆపై రాత్రి 8:30 గంటలకు ప్రత్యేక విమానంలో కవితను ఢిల్లీకి తరలించింది. కవిత వెంట ఆమె భర్త కూడా వచ్చేందుకు అధికారులు అనుమతించారు. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో శనివారం కవితను హాజరుపర్చగా.. వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. కస్టడీలో ఉన్నంతకాలం రోజూ గంటపాటు కుటుంబ సభ్యులు, మిత్రులను కలుసుకునేందుకు కవితకు అనుమతిచ్చింది. అలాగే, ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో కవితను కలుసుకునేందుకు ఆదివారం ఉదయం కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఆయన కవితతో భేటీ కానున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News