Kotappakonda: మొక్కులు తీర్చుకునేందుకు కోటప్పకొండకు భక్తులు.. బోల్తాపడిన బస్సు
- పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకొనేందుకు స్కూలు బస్సులో ప్రయాణం
- బస్సు కట్టర్ విరిగిపోవడంతో బోల్తా పడిన బస్సు
- 40 మందికి గాయాలు.. ఒంగోలు రిమ్స్‌కు తరలింపు
మొక్కులు తీర్చుకునేందుకు కోటప్పకొండకు వెళ్తుండగా బస్సు బోల్తాపడి 40 మంది గాయపడ్డారు. బాపట్ల జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కోటప్పకొండపై పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకొనేందుకు బాపట్ల జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, దర్శి మండలం కొర్లమడుగు గ్రామానికి చెందిన దాదాపు 60 మంది స్కూలు బస్సులో కోటప్పకొండకు బయలుదేరారు.
బస్సు జిల్లాలోని తిమ్మాయపాలెంలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలోకి చేరుకున్న సమయంలో బస్సు కట్టర్ విరిగిపోవడంతో బోల్తాపడింది. ప్రమాదంలో 40 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమచికిత్స అనంతరం ‘108’ వాహనాల్లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.