Praja Galam: పదేళ్ల తర్వాత ఒకే వేదికపైకి మోదీ, చంద్రబాబు, పవన్
- నేడు బొప్పూడి వద్ద ప్రజాగళం సభ
- సభకు హాజరవుతున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్
- ఇటీవలే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారు
- బొప్పూడి సభ ద్వారా ఎన్నికల యుద్ధభేరి మోగించనున్న ముగ్గురు నేతలు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ సాయంత్రం టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రజాగళం సభ నిర్వహిస్తోంది. ఈ భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. పదేళ్ల తర్వాత తొలిసారిగా ఈ ముగ్గురు ఒకే వేదికపైకి రానున్నారు. 2014లో ఈ ముగ్గురు చేయి కలిపి ఏపీలో విజయం సాధించడం తెలిసిందే. 2019లో కూటమి విడిపోయింది. ఇప్పుడు పరిస్థితులు ఈ మూడు పార్టీలను మళ్లీ కలిపాయి.
ఇవాళ ప్రజాగళం సభతో మూడు పార్టీల కూటమి ఎన్నికల యుద్ధభేరి మోగించనుంది. కాసేపట్లో సభ ప్రారంభం కానుంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ శ్రేణులు బొప్పూడి సభకు భారీగా తరలి వస్తున్నాయి. వివిధ జిల్లాలను నుంచి చిలకలూరిపేటకు బైకులు, కార్లతో ర్యాలీగా కార్యకర్తలు కదం తొక్కుతున్నారు. కూటమి పంతం... వైసీపీ అంతం అంటూ నినాదాలు చేస్తున్నారు.
దాదాపు 10 లక్షల మంది ఈ సభకు వస్తారని అంచనా. ఆ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరాక నిర్వహిస్తున్న తొలి ఎన్నికల సభ ఇదే. కూటమి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రజలకు జరిగే మేలును ఈ సభ ద్వారా ప్రజలకు వివరించనున్నారు.
నేటి సాయంత్రం ప్రధాని మోదీ 4.10 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడ్నించి హెలికాప్టర్ లో బయలుదేరి బొప్పూడి చేరుకుంటారు. హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి సాయంత్రం 5.20 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ప్రజాగళం సభకు ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని ఎన్ఎస్ జీ సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు. బందోబస్తు విధుల్లో 5 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు.
ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల కోసం 7 హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. బొప్పూడి ప్రజాగళం సభకు 300 ఎకరాల విస్తీర్ణంలో భారీగా ఏర్పాట్లు చేశారు. సభా వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పాటు మరో 27 మంది ఉంటారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. కార్యకర్తలు, ప్రజలు కూర్చునేందుకు సభా ప్రాంగణంలో 24 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సభలో 20 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
కాగా, తన సోదరుడు నాగబాబుతో కలిసి హెలికాప్టర్ లో పవన్ కల్యాణ్ బొప్పూడి సభా ప్రాంగణానికి చేరుకున్నారు.