Praja Galam: ప్రజాగళం సభలో వేదికపై కూర్చోనున్న మూడు పార్టీల నేతలు వీరే!... కార్యకర్తలతో కలిసి గ్యాలరీలో కూర్చోనున్న లోకేశ్
- కాసేపట్లో మూడు పార్టీల ఉమ్మడి సభ ప్రారంభం
- ఇప్పటికే బొప్పూడి చేరుకున్న నారా లోకేశ్
- ప్రధాన వేదికపైకి 14 మంది టీడీపీ నేతలకు అవకాశం
- వేదికపై కూర్చోనున్న 9 మంది జనసేన నేతలు, ఆరుగురు బీజేపీ నేతలు
టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి బొప్పూడి వద్ద నిర్వహిస్తున్న ప్రజాగళం సభ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సభకు హాజరయ్యేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బొప్పూడి చేరుకున్నారు. కాగా, ప్రజాగళం సభా వేదికపై కాకుండా, కార్యకర్తలు, నేతలతో కలిసి గ్యాలరీలో కూర్చోవాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు.
ప్రజాగళం సభా వేదికపైకి 14 మంది టీడీపీ నేతలను అనుమతిస్తున్నారు. ప్రధాన వేదికపై చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, అశోక్ బాబు, ఎంఏ షరీఫ్, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనంద్ బాబు, తంగిరాల సౌమ్య, అనగాని సత్యప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు కూర్చోనున్నారు.
ఇక జనసేన పార్టీ నుంచి 9 మంది నేతలు ప్రజాగళం సభా వేదికపై ఆసీనులు కానున్నారు. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, నాగబాబు, కొణతాల రామకృష్ణ, శివశంకర్, వెంకటేశ్వరరావు, బొమ్మిడి నాయకర్, కందుల దుర్గేశ్, లోకం మాధవి వేదికపై కూర్చుంటారు.
ప్రధాని మోదీ కాకుండా బీజేపీ నుంచి ఆరుగురు నేతలు ప్రజాగళం సభ ప్రధాని వేదికపై కూర్చోనున్నారు. పురందేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు, టీజీ వెంకటేశ్, సుధాకర్ బాబులకు అవకాశం కల్పించారు.