Birth Certificate: ప్రభుత్వ పథకాల నుంచి ప్రభుత్వ నియామకాల వరకు ఇకపై బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి!
- తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం
- క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాల సీఎస్‌లను కోరిన ప్రభుత్వం
- ఏపీలో మొత్తం 14,752 జనన, మరణ నమోదు యూనిట్లు
- ఇకపై ఏడు రోజుల్లోనే జనన, మరణ ధ్రువీకరణ పత్రం
ప్రభుత్వ పథకాలు, విద్యాసంస్థల్లో చేరిక, ప్రభుత్వ నియామకాలకు బర్త్ సర్టిఫికెట్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ విషయమై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరినట్టు ఆంధప్రదేశ్ సీఎస్ తెలిపారు. ఏపీలో ఆసుపత్రులు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, పంచాయతీల్లో కలిపి మొత్తం 14,752 జనన, మరణ నమోదు యూనిట్లు ఉన్నాయి.
కొత్త చట్టం ప్రకారం జనన, మరణ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏడు రోజుల్లో పూర్తిచేసి సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్రాల చీఫ్ రిజిస్ట్రార్లు, జాతీయ, రాష్ట్రాల స్థాయిలో జనన, మరణాల డేటాను నిర్వహిస్తారు. దీంతోపాటు జనాభా రిజిస్టర్, ఎలక్టోరల్ రోల్స్, ఆధార్ నంబర్లు, రేషన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఆస్తుల రిజిస్ట్రేషన్ డేటా బేస్‌లు కూడా ఉంటాయని సీఎస్ వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే జననాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థకు ఇవ్వాల్సి ఉంటుంది.