BRS: బిడ్డా... నువ్వు గేట్లు తెరిచావ్, ఇంకా మేం తెరువలేదు.. మేం తెరిస్తే..!: రేవంత్ రెడ్డికి పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్
- దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- పార్టీ మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- సింహం అడుగు వెనక్కి వేసిందంటే నాలుగు అడుగులు ముందుకు దూకడానికే అని గుర్తుంచుకోవాలని వ్యాఖ్య
- ప్రభుత్వాన్ని మేం పడగొడతామని చెప్పలేదు... నల్గొండ, ఖమ్మం బాంబులే పేల్చేస్తారన్న పాడి కౌశిక్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలోకి తాము గేట్లు తెరిచామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని... కానీ బిడ్డా నువ్వు గేట్లు తెరిచావ్... ఇంకా మేం తెరువలేదు... మేం గేట్లు తెరిస్తే మీరు భూస్థాపితమవుతారని ముఖ్యమంత్రిని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం సోమవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆయన నివాసంలో కలిసి పిటిషన్ సమర్పించింది. ఈ అంశంలో చర్యలు తీసుకుంటామని సభాపతి వారికి హామీ ఇచ్చారు. సభాపతిని కలిసిన వారిలో పాడి కౌశిక్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్ తదితరులు ఉన్నారు.
మరి ఈ రోజు రాళ్లతో కొడతారా?
సభాపతిని కలిసిన అనంతరం పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సభాపతికి పిటిషన్ ఇచ్చినట్లు చెప్పారు. స్పీకర్ కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చెప్పారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. మరి ఈ రోజు రాళ్లతో కొడతారా? తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు.
పంజాగుట్ట బార్ వద్ద బీడీలు అమ్ముకుంటాడని దానం నాగేందర్‌పై రేవంత్ రెడ్డి గతంలో విమర్శించారని... అలా బీడీలు అమ్ముకునే వ్యక్తిని ఈ రోజు ఎందుకు కొనుక్కున్నావు? అని నిలదీశారు. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన దానం నాగేందర్ కచ్చితంగా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అవుతారన్నారు. సుప్రీం కోర్టు తీర్పు కూడా ఉందని.. అందుకే దానం డిస్క్వాలిఫై కావడం ఖాయమన్నారు. దానం కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో రేవంత్ రెడ్డి బాగా నవ్వుతున్నారని... కానీ నీవు లేవలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఒక సింహం అడుగు వెనక్కి వేసిందంటే నాలుగు అడుగులు ముందుకు దూకడానికే అనే విషయం గుర్తించాలన్నారు.
మేం గేట్లు తెరిచాం... అందరూ వస్తున్నారని చెబుతున్నారు... బిడ్డా నువ్వు గేట్లు తెరిచావ్... కానీ మేం ఇంకా తెరవలేదు.. మేం గేట్లు తెరిస్తే మీరు మొత్తం భూస్థాపితం అవుతారు... తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. నోరు వుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని సూచించారు. ప్రభుత్వాన్ని పడగొడతామని మేం అనడం లేదని... ఆయన ప్రశాంతంగా అయిదేళ్లు పాలించుకోవాలని... మేం ఏమీ అనడం లేదన్నారు. కానీ నల్గొండ బాంబులో... ఖమ్మం బాంబులో వారిలో వారే పేల్చుకుంటారని చురక అంటించారు.