Prathipati Pulla Rao: చిలకలూరిపేట సభలో మైక్ ఎందుకు ఆగిపోయిందో చెప్పిన ప్రత్తిపాటి
- ఏపీలో ప్రజాగళం సభ నిర్వహించిన ఎన్డీయే కూటమి
- హాజరైన ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్
- పలుమార్లు మైక్ వినిపించని వైనం
- కరెంటు పోయిందన్న ప్రత్తిపాటి
- ఉద్దేశపూర్వకంగానే ఇలా జరిగి ఉంటుందని వక్తలు అభిప్రాయపడ్డారని వెల్లడి
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాక నిన్న ఆదివారం నాడు చిలకలూరిపేట నియోజకవర్గంలోని బొప్పూడి వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం తెలిసిందే. ఈ సభలో ప్రధాన వక్తలు ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా మైక్ పలుమార్లు వినిపించలేదు. దీనిపై టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు.
చిలకలూరిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజాగళం సభ అంచనాలకు మించి విజయవంతమైందని అన్నారు. కూటమి ఏర్పడిన తర్వాత చిలకలూరిపేటలో జరిగిన ఈ తొలి సభ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. కాగా, ఈ సభలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ మాట్లాడేటప్పుడు పలుమార్లు కరెంట్ పోయిందని ప్రత్తిపాటి పుల్లారావు వివరించారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా జరిగి ఉండొచ్చని వక్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో కూటమి ఆవిర్భావంతో వన్ సైడ్ ఎలక్షన్ జరగబోతోందని ప్రత్తిపాటి ధీమా వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయకుండానే అందరినీ రాజకీయ కక్ష సాధింపుతో ఇబ్బందిపెట్టారని వ్యాఖ్యానించారు. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న వ్యక్తి అందుకు మూల్యం చెల్లించాల్సిందేనని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. జగన్ కు రానున్న ఎన్నికల్లో ప్రజాకోర్టులో తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు.