America: అమెరికాలో తెలుగు వ్యక్తికి ప్రతిష్ఠాత్మక పురస్కారం
- 2024 స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా బోయినపల్లి అనిల్
- అనిల్ తెలంగాణ రాష్ట్రం వరంగల్‌వాసి
- దేశ ఆర్థిక వృద్ధికి పాటుపడిన ప్రముఖ వ్యాపారవేత్తలకు ఈ అవార్డు
- వర్జీనియాలో 2008లో 'స్కై సొల్యూషన్స్' పేరిట సంస్థ ఏర్పాటు
- ప్రస్తుతం ఈక్యామ్స్, ఈ-ఎంఐపీపీ, ఈ-ఎఫ్ఆర్ఎం, బ్లూబటన్ వంటి సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు అనిల్ ప్రాతినిధ్యం
తెలంగాణలోని వరంగల్‌కు చెందిన తెలుగు వ్యక్తికి అమెరికాలో ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. వర్జీనియాలో నివాసం ఉండే బోయినపల్లి అనిల్ ఇండియన్ అమెరికన్ విభాగంలో '2024 స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయ్యాడు. నేషనల్ స్మాల్ బిజినెస్ వీక్ (ఎన్ఎస్బీడబ్ల్యూ) అవార్డు-2024 గ్రహీతలను యూఎస్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్బీఏ) తాజాగా ప్రకటించింది. దేశ ఆర్థిక వృద్ధికి పాటుపడిన ప్రముఖ వ్యాపారవేత్తలకు ఈ స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇవ్వడం జరుగుతుంది.
ఇందులో భాగంగా 'స్కై సొల్యూషన్స్' సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓగా ఉన్న ఆయన వర్జీనియా రాష్ట్రం నుంచి ఈ అవార్డు గెలుచుకున్నాడు. వర్జీనియాకు చెందిన హెర్న్‌డాన్ కంపెనీతో కలిసి 2008లో స్కై సొల్యూషన్స్ సంస్థను ఆయన ఏర్పాటు చేశాడు. ఇక ఈ సంస్థ వ్యాపార సంబంధమైన అంశాల్లో సాంకేతిక పరిష్కారాలను అందిస్తోంది.
ఇక వరంగల్‌లోని కాకతీయ వర్సిటీ నుంచి అనిల్ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదివారు. అనిల్ కొంతకాలం సీఎన్ఎస్ఐ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా హెల్త్‌కేర్ పరిశ్రమలో సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ విధులు నిర్వర్తించారు. అలాగే ఫెన్నీ మే, హారిస్ కార్పొరేషన్లో కూడా ఆయన పని చేశాడు. కాగా, ఎన్ఎస్బీడబ్ల్యూ అవార్డు-2024 అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్ 28, 29 తేదీల్లో వాషింగ్టన్ డీసీలోని వాల్డోర్స్ ఆస్టోరియా హోటల్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎస్బీఏ అడ్మినిస్ట్రేటర్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్యాబినెట్లో సభ్యుడయిన ఇసాబెల్ కాసిల్లాస్ గుల్మాన్ పాల్గొననున్నారు. ఇక తనకు దక్కిన ఈ అరుదైన అవార్డు పట్ల బోయినపల్లి అనిల్ ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆయన ఈక్యామ్స్, ఈ-ఎంఐపీపీ, ఈ-ఎఫ్ఆర్ఎం, బ్లూబటన్ వంటి సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు అనిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిసింది.