Korisapadu: కొరిశపాడు వద్ద జాతీయ రహదారిపై వాయుసేన విమానాలతో ల్యాండింగ్ ట్రయల్స్
- దేశంలో పలుచోట్ల ఎమర్జెన్సీ రన్ వేల నిర్మాణం
- ఏపీలో కొరిశపాడు, సింగరాయకొండ వద్ద రన్ వేలు
- నేడు కొరిశపాడు వద్ద సందడి చేసిన యుద్ధ విమానాలు
విపత్తులు సంభవించినప్పుడు, యుద్ధ సమయాల్లో అత్యవసర రవాణా కోసం దేశంలో కొన్నిచోట్ల జాతీయ రహదారులపై రన్ వేలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఏపీలో బాపట్ల జిల్లా కొరిశపాడు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద ఎన్ హెచ్-16పై ఇలాంటి ఎమర్జెన్సీ రన్ వేలు నిర్మించారు.
ఈ నేపథ్యంలో, నేడు అధికారులు కొరిశపాడు వద్ద జాతీయ రహదారిపై ఫ్లయిట్ ల్యాండింగ్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో సుఖోయ్-30, హాక్ యుద్ధ విమానాలు, ఏఎన్-32 రవాణా విమానం, రెండు హెలికాప్టర్లు పాల్గొన్నాయి. వాయుసేన విమానాలు రన్ వే పై ఐదు మీటర్ల ఎత్తు వరకు వచ్చి మళ్లీ గాల్లోకి లేచాయి. ఇలా పలుమార్లు విన్యాసాలు చేపట్టారు.
యుద్ధ విమానాల రొదతో పరిసర గ్రామాల్లో సందడి నెలకొంది. ఎప్పుడూ చూడని యుద్ధ విమానాలు తమ ప్రాంతంలో చక్కర్లు కొట్టడం పట్ల కొరిశపాడు, సమీప గ్రామాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు.