TDP-JanaSena-BJP Alliance: నిన్నటి ప్రధాని సభలో భద్రత వైఫల్యాలు చోటు చేసుకున్నాయి... సీఈవోకి ఫిర్యాదు చేసిన కూటమి నేతలు
- నిన్న చిలకలూరిపేట వద్ద ఎన్డీయే ప్రజాగళం సభ
- పలుమార్లు మైక్ కు అంతరాయం
- రోడ్డుపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్
- నేడు సీఈవోను కలిసిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు
- సభను భగ్నం చేయడానికి పల్నాడు ఎస్పీ కృషి చేశారన్న వర్ల రామయ్య
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని బొప్పూడి వద్ద నిన్న టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రజాగళం సభను నిర్వహించడం తెలిసిందే. ఇది పొత్తు ఏర్పడ్డాక జరిగిన మొదటి సభ కాగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు.
అయితే, ఈ సభలో పలు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవడం పట్ల టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి నేతలు నేడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన సభలో భద్రతా వైఫల్యాలు చోటుచేసుకున్నాయని, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి తీరు సరిగాలేదని వారు తమ ఫిర్యాదులో వివరించారు.
సీఈవోకు ఫిర్యాదు చేసిన అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. నిన్న చిలకలూరిపేట వద్ద నిర్వహించిన ప్రజాగళం సభ గురించి పోలీసులకు ముందే సమాచారం అందించామని స్పష్టం చేశారు. సభకు భద్రతా ఏర్పాట్లు చేయాలని ఈ నెల 12నే డీజీపీకి లేఖ రాశామని వెల్లడించారు.
నిన్నటి సభ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించలేదని, సభకు వచ్చేవారిని రెండు కిలోమీటర్ల ముందే ఆపేశారని ఆరోపించారు. పల్నాడు ఎస్పీ వైసీపీ కార్యకర్తగా పనిచేశారు అని వర్ల రామయ్య ఘాటు విమర్శలు చేశారు.
చిలకలూరిపేట సభను భగ్నం చేసేందుకు పల్నాడు ఎస్పీ తన వంతు తోడ్పాటు అందించాడని వ్యాఖ్యానించారు. సభను భగ్నం చేసేందుకు ఇంటెలిజెన్స్ డీజీ కూడా ప్రయత్నించారని ఆరోపించారు.
ప్రధాని ప్రసంగించే మైక్ ఆగిపోవడమా? అని వర్ల రామయ్య ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, నలుగురు అధికారులపై ఆధారాలతో సీఈవోకు ఫిర్యాదు చేశామని చెప్పారు. బాధ్యులైన వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని కోరామని వెల్లడించారు.