Chandrababu: బీజేపీతో మా పొత్తును ముస్లిం సమాజం దూరదృష్టితో అర్థం చేసుకోవాలి: చంద్రబాబు
- చంద్రబాబును కలిసిన మైనారిటీ సమితి నేత ఫారూఖ్ షిబ్లీ
- వైసీపీ ముస్లింలలో అభద్రతా భావం కలిగించేలా ప్రచారం చేస్తోందని వెల్లడి
- తన వీడియోలను ఎడిట్ చేశారన్న చంద్రబాబు
- మతపరమైన అంశాల్లో తాము ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టీకరణ
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ నేడు టీడీపీ అధినేత చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిశారు. బీజేపీతో టీడీపీ కలిసిన అనంతరం ముస్లింలలో వైసీపీ అభద్రత భావం సృష్టించేలా ప్రచారం చేస్తోందని షిబ్లీ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన చంద్రబాబు... తాను మాట్లాడిన వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎడిటింగ్ ద్వారా మార్పు చేసి వైసీపీ కుట్ర చేసిందని, ప్రచారంలో ఉన్న ఆ వీడియోలు తప్పు అని వివరించారు.
త్వరలో ముస్లిం డిక్లరేషన్ ప్రకటించి ముస్లింలకు పూర్తి భరోసా కల్పిస్తామని చెప్పారు. అలాగే బీజేపీతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిశామని, కాబట్టి ముస్లిం సమాజం దూరదృష్టితో తమను అర్థం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బాసటగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
గతంలో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో ఉందని, ఆ సమయంలో ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ అంశాల్లో ముస్లిం సమాజానికి టీడీపీ వెన్ను దన్నుగా ఉందని అన్నారు. మతపరమైన అంశాల్లో తాము ఎక్కడా జోక్యం చేసుకోలేదన్న సంగతి ముస్లింలు గుర్తించాలి అని చంద్రబాబు అన్నారు.