Maoists: గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు తెలంగాణ మావోయిస్టు అగ్రనేతల హతం

4 Naxals killed in encounter held in Maharashtra Gadchiroli

  • ఎన్నికల నేపథ్యంలో విధ్వంస కార్యకలాపాల కోసం తెలంగాణ నుంచి మహారాష్ట్రలో అడుగుపెట్టిన నక్సల్స్
  • పక్కా సమాచారంతో పలు బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు
  • ఈ ఉదయం కొలమార్క పర్వత ప్రాంతంలో ఎదురుకాల్పులు
  • హతమైన నక్సల్స్ తలపై రూ. 36 లక్షల రివార్డు

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు నలుగురు హతమయ్యారు. వీరి తలపై రూ. 36 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రాణహిత నదిని దాటి తెలంగాణ నుంచి కొందరు మావోయిస్టులు గడ్చిరోలిలో అడుగుపెట్టినట్టు సోమవారం మధ్యాహ్నం పోలీసులకు పక్కా సమాచారం అందింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విధ్వంస కార్యకలాపాలే లక్ష్యంగా వీరు మహారాష్ట్రలో అడుగుపెట్టినట్టు ఎస్పీ నీలోత్పల్ తెలిపారు. 

సమాచారం అందిన వెంటనే గడ్చిరోలి పోలీసుల ప్రత్యేక పోరాట విభాగమైన C-60కి చెందిన పలు బృందాలతోపాటు సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ కు చెందిన క్విక్ రెస్పాన్స్ టీంను రంగంలోకి దింపారు. ఈ ఉదయం సి-20 బృందం సెర్చ్ ఆపరేషన్‌లో ఉండగా రేపనపల్లి సమీపంలోని కొలమార్క పర్వత ప్రాంతంలో నక్సలైట్లు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసు బృందాలు ఎదురుకాల్పులు జరిపాయి. 

కాల్పులు ఆగిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా నలుగురు నక్సలైట్ల మృతదేహాలు ఆ ప్రాంతంలో కనిపించాయి. వారి తలలపై రూ. 36 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరందరూ తెలంగాణ కమిటీకి చెందినవారేనని పోలీసులు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన నక్సల్స్‌లో ఇద్దరిని వర్గీశ్, మగ్తు గుర్తించారు. వర్గీశ్ మంచిర్యాల డివిజన్ సెక్రటరీ కాగా, మగ్తు చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ. మరో ఇద్దరిని ప్లాటూన్ సభ్యులు కుర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్‌గా గుర్తించినట్టు పోలీసులు వివరించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News