Koppula Eshwar: ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చిల్లరగా మాట్లాడుతున్నారు: కొప్పుల ఈశ్వర్ విమర్శలు
- రేవంత్ రెడ్డి విర్రవీగే మాటలు మానుకోవాలని హితవు
- కేసీఆర్ ఏదో తప్పు చేసినట్లుగా చెప్పడం మూర్ఖత్వమేనన్న ఈశ్వర్
- తెలంగాణ గడ్డపై మరో ఉద్యమం పుడుతుందన్న శ్రీనివాస్ గౌడ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి విర్రవీగే మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఆయన మాట్లాడే భాషపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపించాలన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ ఏదో తప్పు చేసినట్లుగా చెప్పడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. విచారణల పేరుతో గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ఎగ్గొడుతున్నారని విమర్శించారు. దళితబంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాలు ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చిల్లరగా మాట్లాడుతున్నారన్నారు.
కవిత అరెస్ట్ సహా పలు ఘటనలు తమ పార్టీ అధినేత కేసీఆర్ లక్ష్యంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన కవిత అరెస్ట్ ఘటనపై మాట్లాడుతూ... అధికారంలో ఉన్నామని భయపెట్టి పార్టీలో చేర్చుకుంటామంటే కుదరదన్నారు. అసమానతలు, అణచివేత వల్లే నక్సల్ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పుట్టుకు వచ్చాయన్నారు. ఇలాగే కొనసాగితే తెలంగాణ గడ్డపై మరో ఉద్యమం పుడుతుందని హెచ్చరించారు. కేసీఆర్ అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారన్నారు. బ్యాంకులకు లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినవారు ఉన్నారని పేర్కొన్నారు.