Errabelli: పార్టీ మారడం లేదు.. ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు: ఎర్రబెల్లి
- బీజేపీలో చేరుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఎర్రబెల్లి
- ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు చెప్పాలని ప్రణీత్ రావుపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శ
- మోసాలు, మాయ మాటలు రేవంత్ కు అలవాటేనని వ్యాఖ్య
బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దానం నాగేందర్, రంజిత్ లు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు బయటకు వస్తోంది. ఎర్రబెల్లి బీజేపీలో చేరబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ వార్తలపై ఎర్రబెల్లి స్పందించారు. తాను బీజేపీలో చేరబోతున్నాననే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. కావాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తమ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధి కోసం ఒక సైనికుడిలా పని చేస్తానని ఎర్రబెల్లి చెప్పారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, పాలకుర్తి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ను బలహీనపరిచేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ దందాలు, బిజినెస్, తప్పుడు పనులు చేసే నాయకులే పార్టీలు మారుతారని చెప్పారు.
ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ పై ఎర్రబెల్లి స్పందిస్తూ... ఆయన ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు చెప్పాలని ప్రణీత్ రావుపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన ఫ్లాప్ అయిందని అన్నారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని చెప్పారు. మోసాలు చేయడం, మాయ మాటలు చెప్పడం రేవంత్ కు అలవాటేనని అన్నారు.