Harish Rao: రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతు ప్రయోజనాలు పట్టవు: కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం

Harish Rao fires at Congress government over farmers issue

  • అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్న హరీశ్ రావు
  • పంటనష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్
  • బీఆర్ఎస్ హయాంలో పంట నష్టపోతే కేసీఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించారన్న హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతు ప్రయోజనాలు పట్టవని.. ఇకనైనా వారు మేల్కొని అన్నదాతకు అండగా నిలబడాలని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసిందని... పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగళ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.

గతంలో అకాలవర్షాలతో రైతులు నష్టపోతే, బీఆర్ఎస్ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించారని... అక్కడికక్కడే ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారన్నారు. ఇప్పుడు రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ, ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని విమర్శించారు. జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని... ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News