Svr: అప్పట్లో ఎస్వీఆర్ సంపాదించిన ఆస్తులు ఇప్పుడు వేలకోట్లు .. కానీ కరిగిపోయాయి: మనవడు జూనియర్ ఎస్వీఆర్
- ఎస్వీఆర్ విలాసవంతమైన లైఫ్ చూశారన్న జూనియర్ ఎస్వీఆర్
- ఆయనకి ఎక్కువ పారితోషికం ఉండేదని వివరణ
- శివాజీ గణేషన్ తో వేటకి వెళ్లేవారని వెల్లడి
- ఆయన మరణం తరువాత ఆస్తులు కరిగిపోయాయని వ్యాఖ్య
ఎస్వీ రంగారావు .. వెండితెరపై నవరసాలను శాసించిన నటుడు. పౌరాణిక .. జానపద .. సాంఘిక .. చారిత్రక చిత్రాలపై నటనాపరంగా ఆయన వేసిన ముద్ర మరిచిపోలేనిది. అలాంటి ఎస్వీఆర్ గురించి ఆయన మనవడు జూనియర్ ఎస్వీఆర్ సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. " అప్పట్లో కొన్ని సినిమాలకి సంబంధించి, ఎన్టీఆర్ - ఏఎన్నార్ గారి కంటే కూడా మా తాతగారు ఎక్కువ పారితోషికాన్ని తీసుకున్నట్టుగా నేను విన్నాను" అని అన్నారు.
"మా తాతగారు ఉన్నప్పుడు అందరం ఉమ్మడిగానే ఉండేవాళ్లం. విలాసవంతమైన జీవితం ఉండేది. లంకంత ఇల్లు .. లగ్జరీ కార్లు .. ఉండేవి. `జాతి కుక్కల కోసం ప్రత్యేకమైన షెడ్ ఉండేది. ఆయనకి వేట అంటే ఇష్టం .. శివాజీ గణేశన్ గారితో కలిసి వేటకి వెళ్లేవారు. తాతగారు వేటాడిన పులి తాలూకు 'గోరు'ను నేను ఇప్పటికీ వాడుతున్నాను. బంగారం అంటే కూడా ఆయనకి చాలా ఇష్టం" అని అన్నారు.
చెన్నైలో ఇప్పుడు ఐటీ కారిడార్ కి దగ్గరలో అప్పట్లో తాతగారికి ఐదు ఎకరాలు ఉండేది. ఆ తరువాత మా దగ్గర నుంచి శారదగారు కొన్నారు .. ఆమె కూడా ఎవరికో అమ్మేశారు. అలాగే కాకినాడలో కూడా తాతగారు భూములు కొన్నారు. ఆ తరువాత వాటిని కూడా అమ్మేయడం జరిగింది. తాతగారు కొన్ని చోట్ల కొన్న భూములను గురించి మాకు తెలియక పోవడం .. ఆయన దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నవాళ్లు ఆయన పోయిన తరువాత ఇవ్వకపోవడం వంటివి జరిగాయి. ఆయన సంపాదించిన ఆస్తులు ఉండి ఉంటే ఇప్పుడు వాటి విలువ వేలకొట్లలోనే ఉండేది" అని చెప్పారు.