Devineni Uma: ప్రధానమంత్రి సభలో క్రౌడ్ మేనేజ్ మెంట్ బాధ్యత ఎవరిది?: దేవినేని ఉమా
- ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాలు
- వెంటనే విచారణ జరిపించాలన్న దేవినేని ఉమా
- పోలీసు ఉన్నతాధికారులపై సీఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఈ నెల 17న చిలకలూరిపేట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరైన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాలు చోటుచేసుకున్నాయంటూ టీడీపీ నేత దేవినేని ఉమా ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సభలో క్రౌడ్ మేనేజ్ మెంట్ బాధ్యత ఎవరిది? అని సూటిగా ప్రశ్నించారు.
ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని పాల్గొన్న సభ భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని... అవినీతి, దోపిడీలో అధికార వైసీపీ నేతలు పోటీ పడ్డారని ఆ సభ ద్వారా ప్రధాని స్పష్టం చేశారని ఉమా వెల్లడించారు. అనేక పథకాలకు కేంద్రం నిధులు ఇస్తున్నా ఏపీ ప్రభుత్వం సొంత స్టిక్కర్లు వేసుకుంటూ అంతా తామే ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోందని ప్రధాని చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం అని స్పష్టం చేశారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సభను బ్రహ్మాండంగా విజయవంతం చేశారని ఉమా పేర్కొన్నారు.