BJP: సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయాల్లో కీలక పరిణామం.. రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ అభ్యర్థి
- హస్తంపార్టీ కండువా కప్పుకున్న శ్రీగణేశ్ నారాయణన్
- మంగళవారం రాత్రి కాంగ్రెస్‌లో చేరిక
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ సమక్షంలో పార్టీ మార్పు
- డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌లో రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్
ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్ నారాయణన్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం రాత్రి ఆయన హస్తం పార్టీ గూటికి చేరారు. టికెట్ హామీ ఇవ్వడంతో పార్టీ మారారు. మంగళవారం రాత్రి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ నివాసంలో ఆ పార్టీ ఇతర నేతలు మైనంపల్లి హనుమంతరావు, మహేందర్‌రెడ్డి సమక్షంలో గణేశ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనతో కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి గణేశ్‌తో చర్చలు జరిపారు.
కాంగ్రెస్ పార్టీలో చేరికపై శ్రీగణేశ్ మాట్లాడుతూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని అన్నారు. లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ సత్తాచాటుతుందని శ్రీగణేశ్ నారాయణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా పార్టీ అగ్రనేతలు, మాజీ ఎమ్మెల్యేలు పట్నం మహేందర్‌రెడ్డి, మైనంపల్లి హనుమంతరావుతో చర్చలు జరిపానని, సంప్రదింపులు సఫలీకృతమవడంతో కాంగ్రెస్‌లో చేరినట్లు వివరించారు. కాగా మంగళవారం మధ్యాహ్నం వరకు బీజేపీ తరపున ఆయన ప్రచారం చేశారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనూహ్యంగా గంటల వ్యవధిలోనే ఆయన పార్టీ మారడంపై బీజేపీ శ్రేణులు షాక్‌కు గురవుతున్నాయి.