T20 World Cup 2024 Trophy: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ.. న్యూయార్క్‌లో ట్రోఫీ యాత్ర షురూ
- న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై ట్రోఫీని ఆవిష్కరించిన క్రిస్ గేల్, అలీ ఖాన్
- 15 దేశాల్లో ట్రోఫీ ప్రదర్శన
- టీ20 వరల్డ్ కప్ 2024 కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం
- జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు టోర్నీ
- టోర్నీలో పాల్గొంటున్న 20 జట్లు
- జూన్ 5, 9, 12, 15వ తేదీల్లో టీమిండియా మ్యాచులు
టీ20 వరల్డ్ కప్ 2024 ట్రోఫీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆవిష్కరించింది. న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై విండీస్ దిగ్గజ క్రికెటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, అమెరికా జట్టు బౌలర్ అలీ ఖాన్ కలిసి ట్రోఫీని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ట్రోఫీని 15 దేశాల్లో ప్రదర్శనకు ఉంచుతారు. తాజాగా న్యూయార్క్‌లో ప్రారంభమైన ట్రోఫీ యాత్ర 15 దేశాలలో కొనసాగనుంది.
కాగా, ఈసారి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు టోర్నీ జరగనుంది. మొత్తం 20 జట్లు, 4 గ్రూపులుగా ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. జూన్ 2వ తేదీన టోర్నీ ప్రారంభ మ్యాచ్ అమెరికా, కెనడా మధ్య జరగనుంది. అదే రోజు రెండో మ్యాచ్‌లో విండీస్, పవువా న్యూ గినియా తలపడతాయి. ఇక టీమిండియా తన తొలి మ్యాచ్‌ను జూన్ 5వ తేదీన ఐర్లాండ్‌తో ఆడనుంది. ఆ తర్వాత 9వ తేదీన దాయాది పాకిస్థాన్‌తో తలపడుతుంది. 12న అమెరికాతో, 15న కెనడాతో భారత్ తన తదుపరి మ్యాచులను ఆడనుంది.