RCB: ఆ అనుభూతి పొందాలనేది నా కల: ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్లో విరాట్ కోహ్లీ
- బెంగళూరులో నిన్న ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్
- ఈసారి కప్పు కొట్టి ట్రోఫీలను డబుల్ చేస్తామని కోహ్లీ ఆశాభావం
- రాయల్ చాలెంజర్స్ బెంగళూరుగా పేరు మార్చుకున్న ఆర్సీబీ
- 22న చెన్నైలో సీఎస్కేతో తొలి మ్యాచ్
ఇటీవల జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చాంపియన్‌గా నిలిచి ఫ్రాంచైజీకి తొలి ట్రోఫీ అందించిపెట్టింది. ఐపీఎల్లో పురుషుల జట్టు సాధించలేని ఘనత సాధించి ప్రశంసలు అందుకుంది. త్వరలో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మాయిలు సాధించిన దానినే రిపీట్ చేయాలని ఉందని ఆర్సీబీ స్టాల్వార్ట్ విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో నిన్న ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి పురుషు, మహిళా జట్లను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే ఎలా ఉంటుందో అనుభవించాలన్నది తన కల అని పేర్కొన్నాడు. అమ్మాయిలు ట్రోఫీ గెలిచినప్పుడు తాము చూస్తూ ఉన్నామని, ఇప్పుడు ట్రోఫీలను డబుల్ చేస్తామని, అది నిజంగా ప్రత్యేకంగా మిగిలిపోతుందని చెప్పాడు. తొలిసారి ట్రోఫీ గెలిచే జట్టులో భాగస్వామ్యమవుతానని, తన శక్తిసామర్థ్యాల మేరకు కప్పు కోసం ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. ఫ్రాంచైజీ కోసం, అభిమానుల కోసం తన అనుభవాన్నంతా రంగరిస్తానని వివరించాడు.
ఫ్రాంచైజీ పేరు మారింది
ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్లో ఆర్సీబీ ఫ్రాంచైజీ తన జట్టు పేరును కూడా మార్చింది. ఇప్పటి వరకు రాయల్ చాలెంజర్స్ బేంగళోర్ (Bangalore) అని పిలుస్తుండగా, ఇకపై దానిని బెంగళూరు(Bengaluru) అని పిలవనున్నారు. అలాగే, జట్టు కొత్త లోగోను కూడా ఆవిష్కరించారు. ఆర్సీబీ మూడుసార్లు (2009, 2011), 2016)లో ఫైనల్లో బోల్తాపడి కప్పుకు దూరమైంది. ఇక అప్పటి నుంచి ట్రోఫీ అందని ద్రాక్షగానే మారింది. ఈ నేపథ్యంలో ఈసారైనా కప్పు కలను సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌ను డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఈ నెల 22న చెన్నైలో తలపడుతుంది.