Chilkur Priest: ముస్లిం రైతుకు అర్చకుడి సాయం
- కరెంట్ షాక్ తో ఎద్దు చనిపోవడంతో ఇబ్బందుల్లో రైతు కుటుంబం
- మంగళవారం చిలుకూరు ఆలయంలో ఎద్దును అందించిన పూజారి
- సాయానికి కులమతాలు అడ్డుకాదన్న ఆలయ పూజారి సీఎస్ రంగరాజన్
కరెంట్ షాక్ తో ఎద్దు చనిపోవడంతో ఇబ్బంది పడుతున్న ముస్లిం రైతు కుటుంబానికి చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు అండగా నిలిచారు. మంగళవారం ఆ రైతుకు ఎద్దును అందజేశారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ స్థానిక రైతుకు సాయం చేశారు. చిలుకూరుకు చెందిన రైతు మొహమ్మద్ గౌస్ కు చెందిన ఎద్దు ఇటీవల కరెంట్ షాక్ తో చనిపోయింది. దీంతో వ్యవసాయ పనులకు ఇబ్బందిగా మారింది. మరో ఎద్దును కొనేందుకు డబ్బు సమకూరక గౌస్ కుటుంబం ఇబ్బంది పడుతోంది.
ఈ విషయం తెలియడంతో సీఎస్ రంగరాజన్ వెంటనే స్పందించారు. గోసేవ ఔత్సాహికుడు పవన్ కుమార్ సాయంతో ఓ ఎద్దును గౌస్ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ ఆవులు, గేదెలు, ఎద్దులను కుటుంబ సభ్యులతో సమానంగా భావిస్తారని, అలాగే చూసుకుంటారని చెప్పారు. వాటికి ఏదైనా జరిగితే ఇంట్లో వాళ్లకు జరిగినట్లే బాధపడతారని చెప్పారు. రైతులకు ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని, ఇబ్బందుల్లో ఉన్న రైతులకు పశువులను బహుమతిగా ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని రంగరాజన్ పిలుపునిచ్చారు.