Zomato: విమర్శలతో వెనక్కి తగ్గిన జొమాటో.. మళ్లీ ఎరుపు రంగు దుస్తుల్లోనే డెలివరీ
- శాకాహారుల కోసం ’ప్యూర్ వెజ్’ ఫ్లీట్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన జొమాటో
- శాకాహారాన్ని ఆకుపచ్చ దుస్తుల్లో డెలివరీ చేస్తారని ప్రకటన
- ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గిన సంస్థ
- ఇకపై అందరూ రెడ్ డ్రెస్‌నే కొనసాగిస్తారని స్పష్టీకరణ
‘ప్యూర్ వెజ్’ ఫ్లీట్ ప్రకటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వెనక్కి తగ్గింది. తమ డెలివరీ భాగస్వాములందరూ ఎరుపు రంగు దుస్తులనే కొనసాగిస్తారని స్పష్టం చేసింది. శాకాహారుల కోసం కొత్తగా ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ను ప్రారంభిస్తున్నామని, ఈ సేవలు అందించే డెలివరీ బాయ్స్ ఆకుపచ్చ యూనిఫాం ధరిస్తారని ప్రకటించింది. జొమాటో చేసిన ఈ ప్రకటనపై కొన్ని వర్గాల నుంచి నిరసన వెల్లువెత్తడంతో నిర్ణయం ప్రకటించిన కొన్ని గంటల్లోనే వెనక్కి తగ్గింది.
ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని, ఇకపై అందరూ ఎరుపురంగు యూనిఫాంలోనే కనిపిస్తారని స్పష్టం చేసింది. అయితే, అంతమాత్రాన ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవలను నిలిపివేయడం లేదని, వెజ్ ఆర్డర్ల కోసం ప్రత్యేక సిబ్బంది ఉంటారని జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ ప్రకటించారు. ప్రతికూల సామాజిక పరిణామాలు ఎదురైతే మాత్రం సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవల వల్ల కొన్ని వర్గాలు రెగ్యులర్ జొమాటోను బహిష్కరించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గతరాత్రి గోయల్ మాట్లాడుతూ.. ప్యూర్ వెజ్ ఫ్లీట్ విషయంలో ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవన్నారు. జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నప్పటికీ డెలివరీ బాక్సుల్లో ఆహార పదార్థాలు ఒలికిపోతుంటాయని, ఫలితంగా ఆ వాసన ఆ తర్వాత డెలివరీ చేసే పదార్థాలకు కూడా అంటుకుంటుందని వివరించారు. దీనిని నివారించేందుకే ఫ్లీట్‌ను నాన్‌వెజ్, వెజ్‌గా విభజించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కొందరు శాకాహార హోటళ్ల నుంచి మాత్రమే ఫుడ్ ను ఆర్డర్ చేస్తారని, అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే, ఈ కొత్త సేవలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో యూనిఫాం విషయంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని గోయల్ స్పష్టం చేశారు.