Sidhu Moose Wala: పంజాబ్ ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది.. సిద్దుమూసేవాలా తండ్రి ఆవేదన
- 58 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన సిద్దు మూసేవాలా తల్లి
- 50 ఏళ్ల వారు మాత్రమే ఐవీఎఫ్‌కు అర్హులంటూ ప్రభుత్వ నిబంధనలు
- బిడ్డ చట్టబద్ధమేనని నిరూపించే పత్రాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఆవేదన
- రెండేళ్ల క్రితం హత్యకు గురైన సిద్దు మూసేవాలా
రెండేళ్ల క్రితం హత్యకు గురైన పంజాబీ సింగర్ సిద్దు మూసేవాలా తల్లిదండ్రులు చరణ్‌కౌర్-బాల్‌కౌర్ సింగ్ ఈ నెల 17న ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా పంజాబ్ ప్రభుత్వంపై బాల్‌కౌర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. తాము రెండో కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత భగవంత్‌మాన్ సింగ్ ప్రభుత్వం తమను వేధిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారు. భగవంతుడి ఆశీస్సులతో తమకు రెండోకుమారుడు పుట్టాడని, శుభ్‌దీప్ (సిద్దుమూసేవాలా) తిరిగి పుట్టాడని భావిస్తున్నామని, కానీ ప్రభుత్వం మాత్రం తమను వేధిస్తోందని, బాబుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని అడుగుతోందని, ఆ బిడ్డ చట్టబద్ధమనేనని నిరూపించుకోవాలని ఒత్తిడి తీసుకొస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మూసేవాలా తల్లిదండ్రులు ఐవీఎఫ్ విధానంలో బాబుకు జన్మనిచ్చినప్పటికీ బాల్‌కౌర్ సింగ్ ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. కాగా, డిసెంబరు 2021లో పంజాబ్ ప్రభుత్వం ఐవీఎఫ్‌పై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఐవీఎఫ్ కోసం మహిళల వయసు 21 నుంచి 50, పురుషుల వయసు 21 నుంచి 55 ఏళ్ల మధ్యలో ఉండాలని పేర్కొంటూ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, వీరి వయసు అంతకుమించి కావడం గమనార్హం. సిద్దు తల్లి వయసు 58 ఏళ్లు.
బాల్‌కౌర్ సింగ్ మాట్లాడుతూ.. తాను ఎక్కడికి రమ్మన్నా వస్తానని, అన్ని చికిత్సలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు పేర్కొన్నారు. చట్టపరంగా అన్నివిధానాలను తాను అనుసరించానని, ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పిస్తానని తెలిపారు. కాగా, సిద్దు మూసేవాల 29 మే 2022లో పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో హత్యకు గురయ్యారు. అప్పుడాయన వయసు 28 ఏళ్లు. అంతకుముందు అదే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై మాన్సా నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు.