CP Radhakrishnan: తెలంగాణ ఇన్‌చార్జ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్.. తెలంగాణ గవర్నర్లు అందరూ తమిళులే!
- రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదె
- హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
- ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణన్
తమిళిసై సౌందరరాజన్ రాజీనామాతో ఖాళీ అయిన తెలంగాణ గవర్నర్ పోస్టులో ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఇన్‌చార్జ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదె ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు ఈ కార్యక్రమానికి హారయ్యారు.
తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ పనిచేసిన నేపథ్యంలో రాధాకృష్ణన్‌కు కూడా ఆ బాధ్యతలు అప్పగించారు. కాగా, రాధాకృష్ణన్ గతేడాది ఫిబ్రవరిలో ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ గతంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు నియమితులైన గవర్నర్లు అందరూ తమిళనాడు వారే కావడం గమనార్హం.