Hyderabad: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం... కిడ్నాప్ చేశామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్
- మార్చి 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థి అబ్దుల్
- క్లీవ్‌లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బంధువులు, సన్నిహితులు
- 1200 డాలర్లు ఇస్తే సురక్షితంగా వదిలిపెడతామని తల్లిదండ్రులకు గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్
హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల విద్యార్థి అమెరికాలో మార్చి 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. అయితే కిడ్నాపర్ల నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని హైదరాబాద్‌లోని సదరు విద్యార్థి కుటుంబసభ్యులు చెబుతున్నారు. భాగ్యనగరానికి చెందిన అబ్దుల్ క్లీవ్‌ల్యాండ్స్‌లో ఐటీలో మాస్టర్ డిగ్రీ చదువుతున్నాడు. అయితే అతను మార్చి 7 నుంచి కనిపించడం లేదు. దీంతో 8వ తేదీన అమెరికాలోని అబ్దుల్ బంధువులు, సన్నిహితులు క్లీవ్‌ల్యాండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
తన కొడుకు మిస్ అయిన వారం తర్వాత గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని అహ్మద్ తండ్రి సలీమ్ తెలిపారు. తాము అబ్దుల్‌ను కిడ్నాప్ చేశామని, అతనిని సురక్షితంగా వదిలిపెట్టాలంటే తమకు 1,200 డాలర్లు ఇవ్వాలని ఆ ముఠా డిమాండ్ చేసినట్లు చెప్పారు. తాము అడిగిన మొత్తం ఇవ్వకుంటే అబ్దుల్ కిడ్నీని అమ్మేస్తామని హెచ్చరించారని వాపోయారు.
అబ్దుల్‌ను గుర్తించడంలో సహాయం కోరుతూ అతని కుటుంబం మార్చి 18న షికాగోలోని భారత కాన్సులేట్‌ను సంప్రదించింది. ప్రస్తుతం క్లీవ్‌ల్యాండ్ పోలీసులు అబ్దుల్ మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అబ్దుల్ తల్లి ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ... మార్చి 7న చివరిసారి తన కొడుకుతో మాట్లాడానని, ఆ తర్వాత నుంచి ఎలాంటి ఫోన్ కాల్ లేదన్నారు. తన కొడుకు ఎక్కడున్నాడో పోలీసులు దర్యాఫ్తు చేయాలని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.