Vanga Geetha: పవన్ సోదరా... విషయాలు పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి: ఎంపీ వంగా గీత
- పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్
- ఓటుకు పది వేలు ఇస్తున్నారంటూ నిన్న పవన్ వ్యాఖ్యలు
- వంగా గీతను రాజకీయాల్లోకి తెచ్చిందే తామని వెల్లడి
- తాను ప్రజారాజ్యంలో చేరకముందే ఎంపీనని వంగా గీత స్పష్టీకరణ
ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనుండగా, అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది. జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుండడమే అందుకు కారణం. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎంపీ వంగా గీత బరిలో దిగుతున్నారు.
అయితే, పవన్ కల్యాణ్ నిన్న మాట్లాడుతూ, ఈ ఎన్నికలు అయిపోయాక వంగా గీత జనసేన పార్టీలోకి వస్తారని వ్యాఖ్యానించారు. ఆమెను రాజకీయాల్లోకి తీసుకువచ్చిందే తామని అన్నారు. పిఠాపురంలో తన ఓటమి కోసం మంత్రి పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డిని రంగంలో దించారని, ఓటుకు రూ.10 వేలు, కుటుంబానికి లక్ష ఇస్తున్నట్టు తెలుస్తోందని వివరించారు. ఎవరెన్ని చేసినా పిఠాపురంలో తన గెలుపును అడ్డుకోలేరని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలపై ఎంపీ వంగా గీత స్పందించారు. ఆయన చెబుతున్నట్టు నేను రాజకీయాల్లోకి వచ్చింది 2009లో కాదని, తాను డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. విద్యార్థి రాజకీయ నేతగా ప్రస్థానం ప్రారంభించానని, స్కూలు స్థాయి నుంచే తనకు సేవ అంటే ఇష్టమని, ప్రజల్లో ఉండడం అంటే ఇష్టమని చెప్పారు. స్కూల్లో కూడా చీపురు పట్టుకుని ఊడ్చేదాన్నని వంగా గీత వెల్లడించారు. ఎన్ఎస్ఎస్ లో బెస్ట్ వర్కర్ ని అని, ఎన్సీసీలో బెస్ట్ కేడెట్ ని అని వివరించారు.
"2009లో మా అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం తరఫున నాకు అవకాశం ఇచ్చేటప్పటికే నేను రాజ్యసభ సభ్యురాలిని. ఈ విషయం అల్లు అరవింద్ గారికి, అందరికీ తెలుసు. జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశాను, ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలినయ్యాను. 2006లో రాజ్యసభకు వెళ్లాను. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరాను.
సోదరుడు పవన్ కల్యాణ్ ను నేనేమీ తప్పుబట్టడం లేదు. ఇది రాజకీయ రంగం కదా... పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలి. నేను సీనియర్ రాజకీయ నాయకులినే అయినప్పటికీ, మా పార్టీలోకి వచ్చేయండి అని ఆయనను ఆహ్వానించలేను. అలా ఒకరిని పార్టీలోకి ఆహ్వానించడం కరెక్ట్ కాదు. మా పార్టీ తరఫున, మా జగన్ గారి తరఫున నేను పోటీ చేస్తున్నాను. పిఠాపురంలో కచ్చితంగా గెలుపు నాదే.
మనిషికి లక్ష ఇస్తున్నారంటూ నిన్న మీటింగ్ లో మాట్లాడారు... ఇప్పటి నుంచే ఎందుకు దింపుడు కళ్లం ఆశలు! పోలింగ్ కు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈ లోపున చక్కగా ప్రచారం చేసుకోవచ్చు... ఇప్పుడే డబ్బుల గొడవ ఎందుకు? ప్రజలేంటి, వాళ్ల పరిస్థితులేంటి, వాళ్ల ఇబ్బందులేంటి... నియోజకవర్గానికి చేయాల్సిందేమిటి? ఇవి కదా ఆలోచించాలి.
ప్రజల మనసు మెప్పించి కదా మనం గెలవాలి... ఓట్లు కొనేస్తారంటూ ఇప్పుడే మాట్లాడడం ఎందుకు? బయటి వ్యక్తులు ఇక్కడికి వస్తున్నారు అనడం ఎందుకు? తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆ పార్టీ నేతలు రారా? రేపు ఇక్కడికి టీడీపీ, జనసేన నేతలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ప్రచారం చేయరా? బీజేపీ నేతలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ప్రచారం చేయడం లేదా? విజేత ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు" అని వంగా గీత స్పష్టం చేశారు.