Gautam Gambhir: ప్రపంచంలోనే అసలైన టీం ప్లేయర్ ఎవరో చెప్పిన గౌతమ్ గంభీర్
- నెదర్‌లాండ్స్ మాజీ క్రికెటర్ రయాన్ టెన్ డోషేపై గౌతమ్ గంభీర్ ప్రశంసలు
- ప్రపంచంలో అతి గొప్ప టీం ప్లేయర్ అతడే అంటూ కితాబు
- కేకేఆర్ టీం తనను విజయవంతమైన లీడర్‌గా తీర్చిదిద్దిందని వ్యాఖ్య
- కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాక గౌతమ్ గంభీర్ ఇంటర్వ్యూ
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా రెండు ఐపీఎల్ టైటిళ్లు సాధించిన గౌతమ్ గంభీర్ తాజా సీజన్‌లో టీం మెంటార్ బాధ్యతలు చేపట్టారు. దీంతో, కేకేఆర్ జట్టులో ఆనందం వెల్లివిరిస్తోంది. కాగా, స్వీయ రికార్డుల కంటే జట్టుకే తొలి ప్రాధాన్యమిచ్చే ఆటగాడిగా పేరున్న గౌతమ్ గంభీర్.. తన దృష్టిలో అసలైన టీం ప్లేయర్ ఎవరో తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
‘‘నా 42 ఏళ్ల కెరీర్‌లో తొలిసారిగా ఈ విషయం చెబుతున్నా. నా దృష్టిలో అసలైన నిస్వార్థజీవి, టీం కోసం ఆడే అత్యుత్తమ ఆటగాడు..రయాన్ టెన్ డొషేట్‌యే. అతడి కోసం నేను తూటాకు ఎదురు నిలవగలను. 2011లో కేకేఆర్ కెప్టెన్‌గా అతడిని ప్రత్యక్షంగా పరిశీలించాకే ఈ విషయం చెబుతున్నా. అప్పట్లో టీంలో నలుగురు విదేశీ ఆటగాళ్లున్నారు. అప్పటికే రయన్ వరల్డ్ కప్‌లో అత్యద్భుత ప్రదర్శన చేశాడు. కానీ మేము మిగిలిన ముగ్గురినీ ఎంపిక చేశాం. కానీ అతడి మొహంలో మాత్రం అసంతృప్తి లేదు. చాలా సంతోషంగా టీం సభ్యులకు డ్రింక్స్ అందించాడు. అతడిని చూసే నేను నిస్వార్థంగా ఎలా ఉండాలో నేర్చుకున్నా. వీళ్లే నన్ను లీడర్‌గా తీర్చిదిద్దారు. కేకేఆర్ టీం నా వల్ల సక్సెస్ కాలేదు. కేకేఆర్ వల్లే నేను విజయవంతమైన లీడర్‌గా ఎదిగా’’ అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.