Jayaprakash Narayan: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించిన జయప్రకాశ్ నారాయణ
- కీలక నిర్ణయం తీసుకున్న లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జేపీ
- ఏపీ ఎన్నికల్లో తాము ఎన్డీయే కూటమి వైపేనని వెల్లడి
- అరాచక పాలనను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టీకరణ
లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఏపీ ఎన్నికల్లో తాము ఎన్డీయే కూటమివైపేనని అన్నారు. ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్యవాదులు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోందని... రెడ్డి సామాజిక వర్గం వైసీపీ వైపు ఉంటే... కమ్మ, కాపులు ప్రతిపక్ష పార్టీల వైపు ఉన్నారని జేపీ విశ్లేషించారు. సంక్షేమమే పాలన అనుకుని, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని హెచ్చరించారు. అభివృద్ధి చేస్తేనే పాలన అని స్పష్టం చేశారు.
ఏపీ కంటే ఒడిశాలో నయమని, ఒడిశాలో రూ.26 వేల కోట్ల ఆదాయం ఉందని, ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా అవసరం అనుకుంటేనే అప్పులు చేస్తారని జయప్రకాశ్ నారాయణ వెల్లడించారు. కానీ, ఏపీలో అలాంటి పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేశారు.
ఏపీలో రాజకీయ పరిస్థితులు ఇంతలా దిగజారడం బాధాకరమని అన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తులు నియంతలను తలపిస్తున్నారని, మద్దతుదారులకు పూలబాట వేస్తున్నారని, ప్రత్యర్థులకు ముళ్లబాటలు పరుస్తున్నారని జేపీ వ్యాఖ్యానించారు. ఓవైపు దోపిడీ చేస్తూ, మరో వైపు సంక్షేమ పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్నారని, ఇదేనా ప్రజాపాలన అంటే? అని ప్రశ్నించారు.
కొందరు క్లాస్ వార్ అంటున్నారని, ప్రజాస్వామ్యంలో అలాంటి భాష ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణల అమలు సాధ్యం కాదు అనే వారు అసమర్థుల కిందే లెక్క అని స్పష్టం చేశారు.