Pawan Kalyan: రాజోలు నియోజకవర్గంలో జనసేన జెండా మళ్లీ ఎగరాలి: పవన్ కల్యాణ్
- గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఒకే ఒక్క స్థానం... రాజోలు
- జనసేన టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్
- వైసీపీకి దగ్గరైన వైనం
- ఈసారి రాజోలు ప్రజల ఆదరణను మరింత పొందాలని జనసేన నేతలకు పవన్ పిలుపు
గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు. రాజోలు స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రాపాక కాలక్రమంలో వైసీపీకి దగ్గరయ్యారు. వైసీపీలో అధికారికంగా చేరకపోయినా, వైసీపీ ఎమ్మెల్యేనే అనిపించేంతగా ఆ పార్టీతో మమేకం అయ్యారు.
ఈ నేపథ్యంలో, జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో మళ్లీ జనసేన జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించిన ఆ నియోజకవర్గ ఓటర్లు నాడు చూపించిన ఆదరణను ఈసారి మరింత పొందాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాజోలు ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని మాటిచ్చారు.
ఇవాళ మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో రాజోలు జనసేన నియోజకవర్గ నేతలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ సమావేశం అయ్యారు. రాజోలు నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రణాళికాబద్ధంగా అనుసరించాల్సిన విధానాలను పవన్ వారికి వివరించారు.