Nimmagadda Ramesh Kumar: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక కూడా ఓ సలహదారును నియమించారు: నిమ్మగడ్డ రమేశ్
- ఏపీలో 45 మంది సలహాదారులు ఉన్నారన్న నిమ్మగడ్డ
- కోడ్ ను ఉల్లంఘించి ఇంకొక సలహాదారును నియమించారని ఆరోపణ
- సలహాదారులు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని విమర్శ
- సీఈవో సుమోటోగా తీసుకోవాలని విజ్ఞప్తి
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్ డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 45 మంది ప్రభుత్వ సలహాదారులు ఉన్నారని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక కూడా మరో సలహాదారుని నియమించారని ఆరోపించారు. ఈ నియామకం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్టేనని నిమ్మగడ్డ రమేశ్ పేర్కొన్నారు.
కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రయోజనం పొందే ఎవరైనా ఎన్నికల కోడ్, సర్వీస్ రూల్స్ పరిధిలోకి వస్తారని స్పష్టం చేశారు. చాలామంది సలహాదారులు రాజకీయ పాత్ర పోషిస్తున్నారని, రాజకీయ చర్చల్లో మునిగిపోతున్నారని వ్యాఖ్యానించారు.
రాజీనామా తర్వాతే సలహాదారులు రాజకీయ ప్రసంగం చేయాలని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. కానీ, కొంతమంది సలహాదారులు ప్రభుత్వ సదుపాయాలు పొందుతూ, వైసీపీ కార్యాలయాల ఆవరణలో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఎన్నికల కోడ్ ను ధిక్కరిస్తున్నట్టేనని అన్నారు.
ఈ లోపాన్ని ఇప్పటికే ఏపీ సీఈవో దృష్టికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తీసుకెళ్లిందని నిమ్మగడ్డ రమేశ్ వెల్లడించారు. సీఈవో దీనిపై సుమోటోగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటివి ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగిస్తాయని, అందుకే కఠిన చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరుతున్నామని తెలిపారు.