Narendra Modi: ఎన్నికల తర్వాత మా దేశాలకు రండి.. ప్రధాని మోదీకి రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షుల ఆహ్వానం
- రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో బుధవారం ప్రధాని మోదీ చర్చలు
- బుధవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించిన ప్రధాని
- ఎన్నికల్లో గెలిచిన రష్యా అధ్యక్షుడికి ప్రధాని శుభాకాంక్షలు
- ద్వైపాక్షిక బంధం బలోపేతం చేయాలని నిర్ణయించిన మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఇరు దేశాధినేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధానిని ఎన్నికల తర్వాత తమ దేశాల్లో పర్యటించాలని ఆహ్వానించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా, పుతిన్, జెలెన్స్కీతో సంభాషణ గురించి మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల్లో మరోసారి గెలిచిన పుతిన్‌కు శుభాకాంక్షలు తెలిపానన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాల బంధం మరింత బలపడాలని, కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
కాగా, భారత్-ఉక్రెయిన్ బంధం బలోపేతం చేయడంపై అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చించానని మోదీ మరో పోస్టులో తెలిపారు. ప్రస్తుతం యుద్ధం ముగింపునకు, శాంతిస్థాపనకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ప్రజల అవసరాలే లక్ష్యంగా భారత్ మానవతాసాయం కొనసాగిస్తుందని హామీ ఇచ్చినట్టు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు, వైమానికరంగంలో సహకారం, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో భారత్‌తో ఆర్థిక, వ్యాపార సంబంధాలు బలోపేతం చేసేందుకు ఉక్రెయిన్ ఆసక్తిగా ఉందని జెలెన్స్కీ చెప్పినట్టు మోదీ అన్నారు. భారతీయ వైద్య విద్యార్థులకు ఉక్రెయిన్ ఆహ్వానం పలుకుతున్నట్టు కూడా ఆయన చెప్పారు.